ఒకరి తర్వాత మరొకరు.. నెక్స్ట్‌ ఎవరు? ఏ ఆఫీసర్ చేతికి బేడీలు పడబోతున్నాయి?

లోకేశ్ దగ్గరున్న రెడ్‌బుక్‌లోని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లపై వరుసపెట్టి..

అప్పుడు హవా చూపించారు. ఇప్పుడు అయోమయంలో ఉన్నారు. రేపేం జరుగుతుందోనన్న టెన్షన్ ఆ అధికారులను వెంటాడుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఓవరాక్షన్‌ చేసిన కొందరు ఆఫీసర్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. సరైన పోస్టింగులు లేక..డిపార్ట్‌మెంట్‌లో తలెత్తుకుని తిరిగే పరిస్థితి కనిపించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఒక్కొక్క అధికార భాగోతం బయటికి తీస్తూ..కటకటాల్లోకి పంపిస్తోంది చంద్రబాబు సర్కార్. అందులో భాగంగా గనులశాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. వెంకటరెడ్డి తీరుతో ప్రభుత్వానికి 2 వేల 566 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు ఫైల్ చేశారు.

ఇక మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ చేసిన కేసులో సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రఘురామ కృష్ణంరాజు కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన విజయ పాల్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రఘురామ కృష్ణరాజును కొట్టింది నిజమేనని సీఐడీ పోలీసులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆయనను కొడుతూ వీడియో కాల్లో తమ బాస్‌కు చూపించామని చెప్పినట్లు సమాచారం. అంతేకాదు రఘురామ కృష్ణంరాజును విచారించే సమయంలో తమ బాస్‌తో పాటు మరో నలుగురు ముసుగేసుకుని వచ్చారని కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌పై కూడా యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.

వీరిపై చర్యలు
మొత్తం 16మంది IAS, IPS ఆఫీసర్లపై యాక్షన్ తీసుకుంది కూటమి సర్కార్. అందులో ముగ్గురిని సస్పెండ్ చేసింది. వెంకటరెడ్డి అరెస్ట్ కాగా ఇక నెక్స్ట్ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు. పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కోసం సీఐడీ స్పెషల్ టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి.

మద్యం కుంభకోణం భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండటంతో వాసుదేవరెడ్డిని కూడా ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయనున్నారు సీఐడీ అధికారులు. ఆ తర్వాత ఏ అధికారిపై యాక్షన్ ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. సినీ నటి జత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ మాజీ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నిపై చర్యలు తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతోంది.

పోస్టింగులు ఇవ్వకుండా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో అతి చేసిన అధికారులపై యాక్షన్ తీసుకుంటూ వస్తోంది. 97మంది IAS, IPS అధికారులను ట్రాన్స్ ఫర్ చేయగా మరో 57 మందికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. రాష్ట్రంలో 59 మంది డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. టాప్ లెవల్ ఆఫీసర్లను పని లేని పోస్టింగ్ ఇవ్వడం, కొందరిని వెయిటింగ్‌లో పెట్టడం, బదిలీలు ఇవన్నింటికీ కారణం రెడ్‌బుక్కే అనే ప్రచారం జరుగుతోంది. లోకేశ్ దగ్గరున్న రెడ్‌బుక్‌లోని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లపై వరుసపెట్టి చర్యలు తీసుకుంటున్నారట.

అయితే జరిగిందేదో జరిగిపోయింది సార్. క్షమించండి అంటూ కొందరు అధికారులు టీడీపీ పెద్దల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాత్రం గత సర్కార్ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదట. దీంతో కుడితిలో పడ్డ ఎలుకలా అయింది అత్యుత్సాహం చూయించిన అధికారుల పరిస్థితి.

దర్శనానికి వెళ్తుంటే ఇలా అడ్డుకోవడం దేశంలో ఇదే తొలిసారి: వైఎస్ జగన్