Kethireddy Venkatarami Reddy : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి షాక్ తగిలింది. ధర్మవరం చెరువును ఆనుకుని ఫామ్ హౌస్ నిర్మించారంటూ జలవనరుల శాఖ నోటీసులు జారీ చేసింది. కేతిరెడ్డి బంధువు (మరదలు) గాలి వసుమతి చెరువును కబ్జా చేశారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు జె సూర్యనారాయణకు కూడా నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూమితో కలిపి 20 ఎకరాలు కబ్జా చేసినట్లు కేతిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.
నోటీసులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందించారు. నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. నోటీసుల్లో పేర్కొన్న భూములు ఇరిగేషన్ పరిధిలో లేవని, సూర్యనారాయణ కొనుగోలు చేసిన భూమిని రెగులైజేషన్ చేశారని తెలిపారు. ఇక, గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయని కేతిరెడ్డి చెప్పారు. నోటీసులు ఇచ్చిన అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.
‘నోటీసులు పూర్తిగా అసంబద్ధం. ఇప్పటికే హైకోర్టులో చాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు కూడా ఆ నోటీసులను కొట్టివేయడం జరిగింది. ఆఫీసర్లు అత్యుత్సాహం చూపిస్తున్నారు. రాజకీయ ఒత్తిడి ఉందని అంటున్నారు. హైకోర్టును ఆశ్రయించడం జరిగింది’ అని కేతిరెడ్డి తెలిపారు.
20 ఎకరాల భూమి కేతిరెడ్డి తమ్ముడి భార్య వసుమతి పేరు మీద ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా, కేతిరెడ్డిపై మంత్రి నారా లోకేశ్ గతంలో ఇలాంటి ఆరోపణలే చేశారు. ”పాదయాత్రలో కేతిరెడ్డి అరాచకాలు తెలుసుకున్నా. ఫామ్ హౌస్ కూడా చూశా. అప్పుడు నాకు అర్థమైంది.. కేతిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1 కేటుగాడు.. గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభించే ముందు రోజు రాత్రి.. వసూలు చేసిన డబ్బులు ఆయన ఇంటికి వస్తాయి. కేతిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మవరం నియోజకవర్గం ప్రజలకు మార్నింగ్ కాదు కదా ఒట్టి బాధలే మిగిలాయి. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఎందుకు పెడుతున్నారో తెలుసా. ఎక్కడ భూములు ఉన్నాయో చూడటానికి వెళ్తాడు. ఇలా ధర్మవరం పట్టణంలో దాదాపు 50 ఎకరాలు కొట్టేశాడు కేతిరెడ్డి” అని తీవ్ర ఆరోపణలు చేశారు నారా లోకేశ్.
Also Read : సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు.. నిందితులకు ఖాకీల మర్యాదలు..!