పార్టీలో ఇక నుంచి వికేంద్రీకరణ విధానాన్ని తీసుకురావాలని జగన్ నిర్ణయం!

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తట్టుకుని నిలబడేలా క్యాడర్ బేస్డ్ గా లీడర్ ఓరియేంటెడ్ గా పార్టీని తీర్చిదిద్దాలని జగన్ చూస్తున్నారని టాక్.

పార్టీలో ఇక నుంచి వికేంద్రీకరణ విధానాన్ని తీసుకురావాలని జగన్ నిర్ణయం!

YS Jagan

Updated On : May 1, 2025 / 9:04 PM IST

చతికిల పడిన పార్టీని తిరిగి బాగుచేయడం ఎలా అని వైసీపీ అధినేత జగన్ ఆలోచిస్తున్నారా? ఎన్నికల్లో ఓటమితో అమాంతం పడిపోయిన పార్టీకి మళ్లీ జవసత్వాలు ఇచ్చేందుకు ఏం చేస్తే బాగుంటుందని పార్టీ అధినేత ఆలోచిస్తున్నారా? పార్టీని అన్నిస్థాయిల్లో పటిష్ఠం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదనే ఆలోచనలో జగన్ ఉన్నారా?

అంటే అవుననే సమాధానం ఏపీ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. పార్టీలో ఇక నుంచి వికేంద్రీకరణ విధానాన్ని తీసుకురావాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఇంతకీ పార్టీ పటిష్టత కోసం జగన్ ఏం చేయబోతున్నారు? ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? వాచ్ దిస్ స్టోరీ.

వైసీపీని ప్రక్షాళన చేసే పనిలో ఆపార్టీ అధినేత జగన్ తలమునకలయ్యారట. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారని ఫ్యాన్ పార్టీలో చర్చ నడుస్తోంది. సరికొత్త వ్యూహాలకు పదును పెడుతూ పార్టీని ముందుకు నడిపించాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా జగన్ పార్టీలో కీలక సంస్కరణలను చేపట్టబోతున్నారని పార్టీవర్గాల్లో టాక్ విన్పిస్తోంది. ఇకనుంచి పార్టీలో వికేంద్రీకరణ విధానం తీసుకురావాలని చూస్తున్నారట.

వైసీపీలో దిగువ స్థాయి నుంచే పార్టీ ఎదగాలని వారే బాధ్యులుగా మారి సమర్ధంగా పనిచేయాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. అందుకే మొన్నటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో చేసిన సూచనలు..నేడు జిల్లా అధ్యక్షులు సమావేశంలో ఇస్తున్న దిశానిర్దేశం రెండింటిని పరిశీలిస్తే..పార్టీని నాయకులకే అప్పగిస్తున్నారన్న టాక్ పార్టీవర్గాల్లో విన్పిస్తోంది.

జగన్ అధ్యక్షతన జరిగిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో..పార్టీకి జిల్లా అధ్యక్షులే సర్వస్వం అన్నారట. మీరే పార్టీ..పార్టీనే మీరు అని క్లారిటీగా చెప్పేశారు. మీరే అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాలని..ఎవరి కోసమో చూడొద్దని సూచించారు. మీకు ఎవరైనా ఆదేశిస్తారేమో అని ఎదురుచూడకుండా సొంత నిర్ణయాలు తీసుకోండి అని జగన్ ఫుల్ ఫ్రీడం ఇచ్చారట. జిల్లా పార్టీకి మీరే యజమానులు..మీ మాటే చెల్లుబాటు అవుతుంది.

ఒకటికి పదిసార్లు పరిశీలన చేసి..
మీరే మొత్తం జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ తో కలుపుకుని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అసెంబ్లీ పరిధిలో రెండు వర్గాలు ఉంటే వారిని కో ఆర్డినేట్ చేసి సమస్యలను పరిష్కారించుకోవాలని సూచించారని సమాచారం. అంతేకాదు బాగా పనిచేయని ఇంచార్జిల విషయంలో కూడా ఒకటికి పదిసార్లు పరిశీలన చేసి..ఆ తర్వాత వారు దారికి రాకపోతే మార్చేసే విషయంలోనూ మీదే కీలకపాత్ర అన్నారు.

జగన్ ఇంతలా వారి మీదనే ఎందుకు బాధ్యతలు మోపుతున్నారన్న చర్చ పార్టీ నేతల్లో మొదలైందట. PAC సభ్యులకూ ఇదే విధంగా సూచించారట. అలాగే జిల్లా అధ్యక్షుల విషయంలో ఈ విధంగానే చెబుతున్నారు. దీంతో జగన్ అధికారాలను వికేంద్రీకరించి పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ దాకా తీసుకెళ్ళాలని అనుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. పార్టీ అధినేత జగన్ అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తోంది.

ఒకవైపు వైసీపీ ముఖ్య నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. పైనున్న పెద్దలు దాకా కూడా ఈ అరెస్టులు రావచ్చు అన్న చర్చ సైతం పార్టీలో సాగుతోందట. అందుకే జగన్ అన్నీ చూసుకునే పార్టీని సమిష్టిగా నాయకులు అంతా కలసి నడిపే విధంగా ఈ కొత్త రకమైన రూపుని పార్టీకి అందిస్తున్నారని అంటున్నారు. ఏవైనా అనుకోని అవాంతరాలు ఏర్పడినా ఇబ్బందులు లేకుండా పార్టీ ముందుకు సాగాలని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. పార్టీలో గత పరిస్ధితులు ఇపుడు లేవని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే గుసగుసలు పార్టీవర్గాల్లో విన్పిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తట్టుకుని నిలబడేలా క్యాడర్ బేస్డ్ గా లీడర్ ఓరియేంటెడ్ గా పార్టీని తీర్చిదిద్దాలని జగన్ చూస్తున్నారని టాక్. మరి ఈ కొత్త రకమైన విధానం సక్సెస్ అయితే ఓకే గానీ, చిక్కల్లా అందరికీ బాధ్యతలు ఇస్తే ఎవరు ఏంచేస్తారో అన్న సందేహం పార్టీ అధినేత జగన్ ను వెంటాడుతోందట. ఏది ఏమైనా వైసీపీ అధినాయకత్వం పార్టీని పటిష్టపరిచేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది.