Kodali Nani : పురంధేశ్వరి లేఖలకు బెదిరేవారెవరూ లేరు.. ఆమె గతాన్ని చూస్తే..: కొడాలి నాని

ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందన్నారు. కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చారని విమర్శించారు.

Kodali Nani, Daggubati Purandeswari

Kodali Nani – Purandeswari : బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నారా లేక టీడీపీలో ఉన్నారా అని ప్రశ్నించారు. పురంధేశ్వరి ఒక లేఖ రాశారని, టీడీపీ అనుకూల ప్రసార సాధనాల్లో హడావుడి చేస్తున్నారని తెలిపారు. పురంధేశ్వరి లేఖలకు అదిరేవారు బెదిరేవారెవరూ ఇక్కడ లేరని స్పష్టం చేశారు. పురంధేశ్వరిని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుందన్నారు.

అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ కక్ష సాధింపుగా జగన్, విజయసాయిరెడ్డి మీద పెట్టిన కేసుల్ని ఈరోజు కాకపోతే రేపు ఏ న్యాయస్థానం అయినా రాజకీయ కేసులే తప్ప, ఎలాంటి అధికార దుర్వినియోగంగానీ, అవినీతిగానీ జరగలేదని నిర్థారిస్తాయని పేర్కొన్నారు. కాబట్టి, ఇలా చార్జిషీట్ల నెంబర్లు వేసి హడావుడి చేసినంత మాత్రాన ఇక్కడ బెదిరేవాళ్ళు ఎవరూ లేరన్నారు.

Pawan Kalyan : చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం.. ఇరువురి భేటీకి రాజకీయ ప్రాధాన్యత

అయితే పురంధేశ్వరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేక తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? అన్నది తేల్చాల్సివుందన్నారు. ఎందుకంటే, ఆమె బీజేపీలో ఉన్నట్టు ఎక్కడా కనిపించడంలేదన్నారు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎన్నికల బరిలోకి దింపవద్దని చంద్రబాబు చేసిన నిర్ణయానికి కారణం ఏమిటో స్వయంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వివరించారని తెలిపారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోందని చంద్రబాబు స్పష్టం చేసినందువల్లే తాను ఇక టీడీపీలో ఉండబోనని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ వెనుక, కాంగ్రెస్ తోనూ ఉన్నది చంద్రబాబేనని అంత స్పష్టంగా కనిపిస్తుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ తో పోరాడుతున్నాం, బీఆర్ఎస్ తో పోరాడుతున్నాం అంటున్న బీజేపీకి కాకుండా పురంధేశ్వరి టీడీపీకి మద్దతు ఇస్తోందన్నారు.

Assembly Elections 2023: 25 మంది అభ్యర్థులతో బీఎస్పీ మూడో జాబితా విడుదల

టీడీపీ అంటే కాంగ్రెసే కదా.. మరి, పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నట్టా? లేక టీడీపీలో ఉన్నట్టా? లేక బీజేపీలో ఉన్నట్టా? అన్నది బీజేపీ వారే అర్థం చేసుకోవాలన్నారు. ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందన్నారు. కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చారని విమర్శించారు.

ఆ తర్వాత బీజేపీలో చేరినా చంద్రబాబు ఆదేశాల మేరకు చంద్రబాబు ప్రయోజనాల కోసమే చేరారని ఆరోపించారు. అంటే దీని అర్థం పురంధేశ్వరికి రాజకీయ విలువలు ఉన్నాయనా..? అవి ఏమాత్రం లేవనా..? అని ప్రశ్నించారు. మరి ఇలాంటి మనిషి కాంగ్రెస్-టీడీపీ కలిసి జాయింట్ గా అప్పట్లో పెట్టిన కేసుల్ని, అదికూడా ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దంటే, కొడుకుగా తన ధర్మం నెరవేర్చకుండా ఉండలేనని జగన్ ఓదార్పు యాత్రకు వెళ్ళినందుకు కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి పెట్టిన కేసులవని విమర్శించారు.

Puvvada Ajay Kumar: కాంగ్రెస్ నాయకులు ఎంతమంది గోడలు కూల్చి కబ్జాలు చేశారో మా దగ్గర ఆధారాలున్నాయి

అలాంటి కేసుల్లో చార్జిషీట్లను ఇప్పుడు బీజేపీలో చేరిన పురంధేశ్వరి ప్రస్తావిస్తున్నారంటే ఆమెకు ఉన్నది ఎవరి మీద ప్రేమ? ఎవరి మీద కోపమని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉన్న రేణుకా చౌదరి, బీజేపీలో ఉన్న పురంధేశ్వరి.. చంద్రబాబు ప్రయోజనాలు, చంద్రబాబు బృందం ప్రయోజనాలు కాపాడటంలో ముందుకు దూకుతున్నారంటే.. వీరి రాజకీయం ఎవరి కోసమని నిలదీశారు.