Tirupati: తిరుపతి బరిలో వైసీపీ కొత్త అభ్యర్థి.. తెరపైకి డాక్టర్ శిరీష పేరు!?

వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తోంది వైసీపీ. అందుకోసం తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

bhumana karunakar reddy, bhumana abhinay reddy

Tirupati Constituency: తిరుపతి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి (bhumana karunakar reddy) టీటీడీ చైర్మన్ (TTD Chairman) చేసిన వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎర్త్ పెట్టాలని చూస్తుందా? రాజకీయాలను రిటైర్ అవ్వాలని చూస్తున్న భూమన వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి తన కుమారుడు అభినయ్‌రెడ్డిని (bhumana abhinay reddy) బరిలో దింపాలని చూస్తున్నారు.. కానీ గత ఎన్నికల ఫలితాలు.. భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ఓ అంచనాకు వస్తున్న వైసీపీ.. ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ (social engineering) చేయాలని చూస్తోంది. తిరుపతి బరిలో కొత్త అభ్యర్థిని పోటీకి దింపి విక్టరీ కొట్టాలని చూస్తోంది. ఇంతకీ వైసీపీ ప్లాన్ ఏంటి?

ఏపీలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలలో తిరుపతి అసెంబ్లీ సీటు ఒకటి. ఇక్కడ నుంచి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, పీఆర్‌పీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పవర్‌స్టార్.. జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా పోటీ చేస్తారనే టాక్ ఉంది. ఇలాంటి సీటును గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా హవా కొనసాగించిన ఫ్యాన్ పార్టీ తిరుపతిలో మాత్రం అతికష్టం మీద గట్టెక్కింది. కేవలం 700 ఓట్ల మెజార్టీతో వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి గెలిచారు. అందుకు కారణం ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ చీల్చిన ఓట్లు ఓ కారణమైతే.. భూమన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ సామాజిక వర్గం మరో కారణం. జనసేన 12 వేల ఓట్లు చీల్చడం.. భూమనకు క్లీన్ ఇమేజ్ ఉండటంతో కష్టంమీదనైనా గెలిచింది వైసీపీ.

Bhumana Karunakar Reddy, Bhumana Abhinay Reddy

ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తోంది వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి రాజకీయాల నుంచి రిటైర్ కావాలని కోరుకుంటున్నారు. చివరిసారిగా టీటీడీ చైర్మన్ పదవి చేపట్టి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు భూమన. ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాలతో కాదనలేక టీటీడీ చైర్మన్ చేశారు సీఎం జగన్. కానీ అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో భూమన కుమారుడు అభినయ్‌రెడ్డికి తిరుపతి టిక్కెట్ ఇస్తాననే గ్యారెంటీ మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారు. అభినయ్‌రెడ్డి ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలని కోరుకుంటున్నారు. కానీ, సామాజిక వర్గాల సమీకరణ దృష్టిలో పెట్టుకుని అభినయ్‌రెడ్డికి చాన్స్ ఇవ్వడం కష్టమేనని చెబుతున్నారు.

Tirupati Mayor Sirisha Yadav

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. యాదవులూ గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాల్లో ప్రత్యర్థి పార్టీ టీడీపీకి గట్టి పట్టు ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని దృష్టిలో పెట్టుకుని రెడ్డి సామాజిక వర్గం వారి కన్నా.. ఆ వర్గాలకు చెందిన నేతను నిలబెడితే ఈజీగా గెలవొచ్చని అధికార పార్టీ అంచనా. అందుకోసం తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ (Dr Sirisha Ydav) పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మేయర్‌ను ఎమ్మెల్యే చేసి ఆమె స్థానంలో అభినయ్‌రెడ్డిని మేయర్‌గా చేయాలనే ప్రతిపాదనను వైసీపీ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం జగన్ కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తున్నారంటున్నారు.

Also Read: తిరుపతి అసెంబ్లీ సీటుపై పవన్ కల్యాణ్ కన్ను పడిందా?

జనసేనాని పోటీ చేసినా.. టీడీపీ, జనసేన పొత్తుతో మరో అభ్యర్థి తెరపైకి వచ్చినా.. తాము స్థానికంగా బలంగా ఉన్న సామాజిక వర్గాలకే చాన్స్ ఇవ్వడం ద్వారా సోషల్ ఇంజనీరింగ్ చేయాలని అనుకుంటున్నట్లు వైసీపీ చెబుతోంది. మేయర్ డాక్టర్ శిరీష యాదవ్‌కి టికెట్ ఇస్తే ఆ వర్గం ఓట్లు చీలిపోయి టీడీపీ దెబ్బ తింటుందని, అది తమ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ ప్రతిపాదన ఎంత వరకు నిజమోగాని తిరుపతిలో హాట్‌టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు