Mla Anirudh Reddy : తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని పలు పుణ్య క్షేత్రాలకు ఏపీకి చెందిన ప్రజాప్రతినిధుల లేఖలతో భక్తులు వచ్చినప్పుడు వారందరికి దర్శనాలు కల్పిస్తున్నామన్నారు. మరి తెలంగాణకు చెందిన భక్తులు ప్రజాప్రతినిధుల లేఖలతో తిరుమలకు వచ్చినప్పుడు ఎందుకు దర్శనానికి అనుమతి ఇవ్వరని నిలదీశారు.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్ల లాంటివి అని చెప్పిన చంద్రబాబు.. తెలంగాణ కన్నును తీసేసుకున్నారా? అని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్లు తెలంగాణలో వ్యాపారం చేసుకున్నారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్లు వ్యాపారం చేసుకున్నారని గుర్తు చేశారు. మరిప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలంతా ఏపీ వాళ్లకు అనుమతి ఇవ్వొద్దని తీర్మానం చేసుకుంటే తమ బాధ తెలుస్తుందన్నారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వం బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కోరారు.
”చాలా బాధతో తిరుమలలో మాట్లాడాల్సి వస్తోంది. ఆగస్టు 2, 3 తేదీలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి సిఫారసు లేఖలు వస్తే మేము వాటిని అంగీకరించము అని చెప్పారు. చంద్రబాబును ఒక్కటే అడగాలని అనుకుంటున్నాం. విభజన సమయంలో నాకు తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అని చంద్రబాబు చెప్పారు. ఈరోజు చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నాం. మరి ఒక కన్నుని తీసేసుకున్నారా? పొడుచుకున్నారా?
అదే తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ యాదగిరిగుట్ట కానీ, భద్రాచలం కానీ.. వాళ్లు ఫోన్ చేస్తే చాలు అక్కడ దర్శనాలు జరుగుతున్నాయి. కానీ, ఇవాళ మా తెలంగాణపై ఎందుకింత చిన్నచూపు. నా నియోజకవర్గం జడ్చర్ల. అక్కడి నుంచి ఓ కుటుంబం తిరుమలకు వస్తుంటే ఓ రూమ్ ఇప్పించమని అడిగితే.. మేము ఇప్పించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆయన చాలా బాధ పడ్డారు. మేము కూడా చాలా బాధ పడ్డాం. వైసీపీ ప్రభుత్వం వస్తేనేమో టీడీపీ నాయకులు తమ వ్యాపారం తెలంగాణలో చేసుకుంటారు. టీడీపీ ప్రభుత్వం ఉంటేనేమో వైసీపీ వాళ్లు తమ వ్యాపారం తెలంగాణలో చేసుకుంటారు. మీరే మా దగ్గర బిజినెస్ లు చేసుకున్నా మేమే ఏనాడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఇవాళ నేను చాలా బాధతో మాట్లాడుతున్నాం. ఒకవేళ మా ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఒక తీర్మానం చేసుకుంటే.. మీరు కూడా తెలంగాణకు రావొద్దని అంటే.. ఆ బాధ ఏంటో మీకు కూడా తెలుస్తుంది. మా బాధలు అర్థం చేసుకోండి. దయచేసి మా లేఖలను యాక్సెప్ట్ చేయండి. తెలంగాణ ప్రజలకు కూడా తిరుమల దర్శనానికి వీలు అవుతుంది. మేము ఒక్కటే కోరుకుంటున్నాం.
లేదంటే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో డిసెంబర్ లో తెలంగాణ ఎమ్మెల్యేలు అంతా కూర్చుని చర్చించుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే మళ్లీ మీరే బాధపడతారు. అన్నదమ్ముళ్ల లాగానే ఉందాము. కేవలం వ్యాపారం కోసమే తెలంగాణకు రాకండి. మా తెలంగాణ ప్రజలు కూడా తిరుమలకు వస్తే దర్శనానికి మా లేఖలు కూడా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాం” అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.