ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో భాగంగా నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. చేనేతలకు అండగా రూ. 24వేలు ఇస్తానని చెప్పినట్లే చేశానని అన్నారు జగన్.
ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మన చేనేత నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం చెప్పుకుంటోందని అన్నారు. అయితే చేనేత సమస్యలను ఎవరూ ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆయన అన్నారు. తన పాదయాత్రలో చేనేత కార్మికుల కష్టాలను చూశానని, అందుకే వారికోసం పథకం పెట్టినట్లు చెప్పారు.
ధర్మవరం నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఆప్కో వ్యవస్థను స్కాం వ్యవస్థగా మార్చేశారని, త్వరలో ఆప్కోను ప్రక్షాళన చేస్తానని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మంచి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.
ఆరు నెలల్లో ఇలాంటి పథకాలు తెచ్చినందుకు గర్వంగా ఉందని జగన్ అన్నారు. అలాగే 25 లక్షల పేదలకు ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని తెలిపారు. జనవరి 9న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకున్నామని, అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా కల్పించామని, మత్స్యకారులను ఆదుకున్నట్లు సీఎం జగన్ చెప్పారు.