జగనన్న తోడు : చెక్ చేసుకోండి, బ్యాంకు ఖాతాల్లో నగదు

Jagananna Thodu Scheme : వీధి వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జగనన్న తోడు స్కీమ్‌ను ప్రవేశపెడుతోంది. ఈ కార్యక్రమాన్ని జగన్ 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏపీలోని లక్షల మంది చిరు, వీధి వ్యాపారులు, హాకర్స్‌కు బ్యాంకుల ద్వారా వారికి 10 వేల వరకు సున్నావడ్డీ రుణాలను అందించనున్నారు. బుధవారం సుమారు 1000 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను అందించే కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తారు.
10 లక్షల మంది దరఖాస్తు :
లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. ఈ పథకం కోసం ఇప్పటి వరకు దాదాపు పది లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంను వర్తింప చేసేందుకు దరఖాస్తు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని ఆదుకుంటానని పాదయాత్రలో జగన్ హామీనిచ్చారు. అధికారంలోకి రాగానే వారి ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టారు.
గ్రామాలు, పట్టణాల్లో సుమారు అయిదు అడుగుల పొడవు, అయిదు అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు.
18 ఏళ్లు నిండి ఉండాలి :
రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌ల పైన, పబ్లిక్, ప్రైవేటు స్థలాల్లో తోపుడు బండ్లపై నిత్యావసరాలు, పండ్లు, కూరగాయాలు అమ్ముకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నవారు, నెత్తిమీద గంపలో వస్తువులు మోస్తూ, అమ్ముకునే పేదవారు ఈ పథకం ద్వారా సాయం పొందొచ్చు. సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు.. సంప్రదాయ వృత్తిదారులైన లేసు తయారీదారులు, కళంకారీ కళాకారులు, ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులు, తోలు బొమ్మల తయారీదారులు, కుండలు, బొబ్బిలి వీణలు, ఇత్తడి సామగ్రి తయారీదారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు అర్హులు. ఈ పథకం ద్వారా సాయం పొందాలంటే వ్యాపారాలు చేసుకునే వారి వయస్సు పద్దెనిమిది ఏళ్లు నిండి వుండాలి. ఆధార్, ఓటర్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డు కలిగి వుండాలి.
https://10tv.in/the-ap-government-withdrew-the-lands-given-to-the-kineta-power-project/
పేరు లేకపోతే :
గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారులను గుర్తించేందుకు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో గుర్తించిన లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద సామాజిక తనిఖీ కోసం ప్రదర్శిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులు ఈ జాబితాలో తమ పేరు లేనిపక్షంలో వెంటనే సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి అర్హులై ఉండి బ్యాంకు ఖాతా లేనివారికి కొత్తగా పొదుపు ఖాతా ప్రారంభించేలా వాలంటీర్ల ద్వారా తోడ్పాటును అందిస్తారు. అర్హులైన వారి దరఖాస్తులను గ్రామీణ ప్రాంతంలో ఎంపిడిఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత బ్యాంకులకు పంపుతారు.
మూడు నుంచి నాలుగు రోజుల్లో రుణం :
బ్యాంకులతో సమన్వయం చేసుకోవడం, పటిష్టంగా ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. బ్యాంకులు తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి, లబ్ధిదారుడి అవసరాన్ని బట్టి పదివేల వరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంకులో లోన్ అకౌంట్‌ను తెరిచిన లబ్దిదారుడికి మూడు నుంచి నాలుగు రోజుల్లో రుణం మొత్తాన్ని జమ చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను అందిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, సెర్ఫ్, మెప్మాలు సమన్వయంతో ఈ పథకం అమలును పర్యవేక్షిస్తాయి.