జమ్మలమడుగు జగడం : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీరుతో వర్గ విబేధాలు

differences with MLA Sudhir Reddy : కడప జిల్లా జమ్మలమడుగు జగడం.. వైసీపీ అధిష్టానానికి తలనొప్పిలా మారింది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీరుతో.. పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు వైసీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మైలవరం మండలం దాన్నవాడలో వైసీపీ మహిళా నేత అల్లె ప్రభావతి ఆధ్వర్యంలో అసమ్మతి నేతలంతా ఒక్కటయ్యారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని సుధీర్‌రెడ్డి పక్కన పెట్టారని అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది. తన అనుచరులకే ఆయన పట్టం కడుతున్నారని మండిపడుతోంది.

సీఎంతో తమకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని, నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలు జగన్ దృష్టికి తీసుకెళ్తామనే ఉద్దేశంతోనే దూరం పెడుతున్నారని అసమ్మతి వర్గం నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలోని అన్ని కాంట్రాక్ట్ పనులను తనకు అనుకూలంగా ఉండే వారికి అప్పగిస్తున్నారని, అసలు వైఎస్ ఫ్యామిలీ పేరు చెబితే చాలు సుధీర్‌రెడ్డి మండిపడుతున్నారని మిగతా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై ఇప్పటికే అసమ్మతి వర్గం నేతలు సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారట. కొట్లాటలు మాని, అందరూ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించినా.. సుధీర్‌రెడ్డి పట్టించుకోవడం లేదని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. ముందు వచ్చిన చెవుల కంటే.. వెనుకొచ్చిన కొమ్ములకే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని అంటోంది. ఎమ్మెల్యే అరాచకాలు భరించలేక పోతున్నామని, పరిస్థితి ఇలాగే ఉంటే.. జమ్మల మడుగులో వైసీపీకి ఇబ్బందులు తప్పవని సుధీర్‌రెడ్డి వ్యతిరేక వర్గం హెచ్చరిస్తోందంటున్నారు.

సుధీర్‌రెడ్డి వ్యతిరేక వర్గం ఆరోపణలు అలా ఉంటే.. ఆయన అనుకూల వర్గం వాదన మరోలా ఉంది. సుధీర్‌రెడ్డిపై ఆరోపణల్లో వాస్తవం లేదని అనుచరగణం చెబుతోంది. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన వారంతా గతంలో టీడీపీకి పని చేశారని వాదిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆ వర్గం పనిచేసిన చోట వైసీపీకి తక్కువ ఓట్లు రావడమే అందుకు నిదర్శనమంటోంది. ఈ విషయం ఎంపీ అవినాష్‌రెడ్డికి కూడా తెలుసునంటోంది సుధీర్‌రెడ్డి వర్గం. ఏదేమైనా.. సీఎం సొంత జిల్లాలో జమ్మలమడుగు పంచాయతీ పార్టీకి తలనొప్పిగా తయారైందంటున్నారు..

ట్రెండింగ్ వార్తలు