×
Ad

ఆ ఇద్దరు లీడర్ల మధ్య కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్ పార్టీ క్యాడర్.. ఎవరి వెంట నడవాలో తెలియక లోకల్ లీడర్ల అయోమయం

వైసీపీకి గట్టి పట్టున్న పట్టణ ప్రాంతాల్లో పులివెందుల తర్వాత జమ్మలమడుగు ఒకటని భావించే జగన్ ఇంచార్జి ఎవరో తేల్చకపోతే ఉన్న క్యాడర్ కాస్త చేజారే ప్రమాదం లేకపోలేదన్న చర్చ చక్కర్లు కొడుతోంది.

YCP: ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయి 15 నెలలు దాటినా చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఇంకా ఇంచార్జ్‌లు లేరు. పోటీ చేసి ఓడిన నేతలు సైలెంట్ అయిపోయి సైలెంట్‌గా ఉండటం లేదట. మరో నేత పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుపుల్ల వేస్తున్నారట.

ఇలా జమ్మడలమడుగు నియోజకవర్గానికి కూడా ఇంచార్జ్‌ ఎవరో తెలియక పోవడంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ కన్ఫ్యూజన్‌లో పడిపోయిందట. తాము ఎవరు కింద పని చేయాలో అర్థం కావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఒకరి దగ్గరికి వెళితే మరొకరు గుస్సా అవుతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. (YCP)

వైసీపీ అధినేత జగన్ పులివెందల మీద ఎంత కాన్సంట్రేషన్ చేస్తారో అంతే ఫోకస్ జమ్మలమడుగు పెడతారు. కానీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జమ్మలమడుగును గాలికి వదిలేశారని క్యాడర్ గుసగుసలు పెట్టుకుంటున్నారట. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గపోరే ఇందుకు కారణమంటున్నారు.

Also Read: లంచాలతో పొలిటికల్ లీడర్లకు ఫండింగ్.. అసెంబ్లీ ఎన్నికల్లో పలువురికి అధికారుల విరాళం!

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అటు సొంత ఊరులో ఉండలేక ఇటు జమ్మలమడుగుకు రాలేక అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారట. మరోవైపు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాత్రం పార్టీ ఆదేశాలను అమలు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది ఇన్ని రోజులు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు తిరిగి పనులు చేయించుకొని పది రూపాయలు వెనకేసుకున్నటువంటి నేతలు తమదారెటో తేల్చుకోలేకపోతున్నారట.

పార్టీ ఆదేశాలతో ఒకరోజు రామసుబ్బారెడ్డి దగ్గరికి మరోసారి సుధీర్ రెడ్డి దగ్గరికి తిరగడమే సరిపోతుందన్న అసంతృప్తిలో సెకండ్ క్లాస్ లీడర్లలో ఉన్నట్లు కనిపిస్తోందట. దీంతో జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జ్‌ ఎవరో తేల్చండి ఫస్ట్ అంటూ..కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ సీఎం జగన్ దగ్గరికి చాలా సార్లు క్యాడర్ వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏడాదికాలం ముగిసింది.

జగన్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ

తాము గోడమీద పిల్లుల్లాగా అటు రామసుబ్బారెడ్డి దగ్గరికి ఇటు సుధీర్ రెడ్డి దగ్గరికి తిరగలేక కన్ఫ్యూజన్‌లో ఉన్నామని అధినేత దగ్గర అసంతృప్తి వెళ్లగక్కారట. కాస్త సంయమనం పాటించండి అన్నీ సెట్ అవుతాయని జగన్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ జమ్మలమడుగులో క్యాడర్ మాత్రం ఇద్దరి నేతల మధ్యన నలిగిపోతున్నారట. గతంలో సుధీర్ రెడ్డి వ్యవహారం నచ్చని కొంతమంది నేతలు నేరుగా ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసి తమ గోడును చెప్పుకునే వారట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని క్యాడర్ అయోమయంలో పడ్డట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో మిగతా జిల్లాలన్నీ ఒక ఎత్తైతే సొంత జిల్లా కడప మాత్రం జగన్‌కు సమ్‌థింగ్ స్పెషల్. అయితే ఇప్పుడు అపోజిషన్‌లో ఉండటంతో కడపపై మరింత ఫోకస్ పెట్టి..పట్టు కోల్పోక ముందే లీడర్లను క్యాడర్‌కు దగ్గర చేయాలన్న డిమాండ్లు బాగా రీసౌండ్ చేస్తున్నాయట.

వైసీపీకి గట్టి పట్టున్న పట్టణ ప్రాంతాల్లో పులివెందుల తర్వాత జమ్మలమడుగు ఒకటని భావించే జగన్ ఇంచార్జి ఎవరో తేల్చకపోతే ఉన్న క్యాడర్ కాస్త చేజారే ప్రమాదం లేకపోలేదన్న చర్చ చక్కర్లు కొడుతోంది. జగన్ వీలైనంత త్వరగా చొరవ తీసుకొని జమ్మలమడుగుకు ఇంచార్జ్‌ను పెట్టాలని..గ్రామస్థాయి లీడర్లు డిమాండ్ చేస్తున్నారట. సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డిలో ఎవరికి జమ్మలమడుగు పార్టీ పగ్గాలు అప్పగిస్తారో చూడాలి మరి.