బీజేపీతో పవర్‌ స్టార్ పొత్తుపై జనసైనికుల్లో అయోమయం

  • Publish Date - February 5, 2020 / 01:17 PM IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పశ్చిమ గోదావరి జిల్లా కలిసి రాలేదంటున్నారు. సొంత జిల్లా అయినా కూడా ఇక్కడ జనసేనానిని ఆదరించలేదు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. అక్కడ నుంచే తన విజయ ప్రస్థానం మొదలు పెట్టాలనుకున్న జనసేనాని… భీమవరం నుంచి పోటీ చేసినా ఫలితం మారలేదు. తన రెండో అన్నయ్య నాగబాబును కూడా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయించారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. అలా ముగ్గురు అన్నదమ్ములకు పశ్చిమ గోదావరి జిల్లా కలిసి రాలేదని అనుకుంటున్నారు. 

పార్టీ నేతల్లో ఆందోళన :
జనసేనాని పవన్‌కు ఉన్న ఆదరణ చూసి 2019 ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని టీడీపీ, వైసీపీల నుంచి కూడా జనసేనలోకి చాలా మంది చేరారు. కానీ జిల్లాలో జనసేనాని పాచిక పారలేదు. పవన్ కళ్యాణ్, నాగబాబు సహా జిల్లాలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ఓడిపోయారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలు జిల్లాలో పెద్దగా లేకపోవడంతో నాయకులంతా సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ ఇప్పుడు జనసేన నాయకులకు, కార్యకర్తలకు అసలు సమస్య వచ్చిపడిందంటున్నారు. 

కనీసం పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వకుండా, కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోకుండా బీజేపీతో జనసేనాని పొత్తు పెట్టుకోవడంతో తలలు పట్టుకుంటున్నారట. టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చిన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, పాలకొల్లు వైసీపీ నాయకుడు గుణ్ణం నాగబాబు, ఏలూరు కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు, తణుకు నుంచి పసుపులేటి వెంకట రామారావు లాంటి వాళ్లు ఇప్పుడు ఏమి చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారట. టీడీపీ, వైసీపీలో ఉన్నప్పుడు కార్యకర్తల్లో, పార్టీ నాయకుల్లో కనీసం మర్యాద అయినా ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్వరు పలకరించే నాయకుడు లేరంటూ సన్నిహితుల దగ్గర ఫీలవుతున్నారట. 

ఎన్నికల్లో టికెట్ దక్కేనా? : 
తాడేపల్లిగూడెం టీడీపీలో ఒక వెలుగు వెలిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ పరిస్థితి ఇంకా దారుణంగా మారిందట. ఈ పొత్తుతో ఇప్పుడు బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి మాణిక్యాలరావుతో కలిసి ఎలా పని చేయాలని తమ వారి దగ్గర వాపోతున్నారట. ఇలా కలిసి పనిచేస్తే రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదని ఆవేదన చెందుతున్నారు. ఆయన ఒక్కరే కాదు జిల్లాలో పవన్ కళ్యాణ్‌ని నమ్ముకుని జనసేనలోకి వచ్చి ఎన్నో డబ్బులు ఖర్చు చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు బీజేపీతో కలిసి పని చేయడానికి రెడీగా లేరని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. 

జనసేనాని బీజేపీతో పొత్తుకు వెళ్లే ముందు పార్టీ కింది స్థాయి నాయకులకు కూడా చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్ ఎటు వైపు వెళ్తుందో అర్థం కాక మధనపడుతున్నారు. వచ్చే ఎన్నికల మాట పక్కన పెడితే అసలు త్వరలో జరిగే స్థానిక ఎన్నికల వరకు అయినా పార్టీలో ఉందామా? సొంత పార్టీల గూటికి తిరిగి వెళ్లిపోదామా అని జిల్లాలోని జనసేన నాయకులు ఆలోచిస్తున్నారంట. మరి ఈ విషయంలో జనసేనాని వారికి ఏమైనా భరోసా ఇచ్చేందుకు చర్చిస్తారా.. లేకపోతే ఇలానే వదిలేస్తారా.. అని జనాలు అనుకుంటున్నారు.