Pawan Kalyan: విశాఖలో జనసేన కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు అండగా ఉంటే జనసేన జాతీయ పార్టీ అవుతుందన్నారు. పార్టీ ప్రారంభించినపుడు దారి తెన్నూ తెలీదు, నమ్మకం మాత్రమే ఉందన్నారు. మిడిల్ క్లాస్ వ్యక్తులు రాజకీయాలను శాసించే వారని, వారంతా రకరకాల కారణాలతో విడిపోయారని చెప్పారు. సగటు మనిషి ఉద్వేగంతో జనసేన ప్రారంభమైందన్నారు.
వచ్చే ఏడాది మార్చి 14కి జనసేనకు 12 ఏళ్లు వస్తాయన్నారు. దశాబ్ద కాలంలో బాధ్యతలను మోయడంలో కుటుంబాన్ని కూడా విస్మరించానని పవన్ వాపోయారు. సినిమాలపైనా దృష్టి సారించలేకపోయానన్నారు.
”నా సంపూర్ణ దృష్టి జనసేన పార్టీపైనే పెట్టా. దాని ఫలితమే దేశంలోనే 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం. విముక్తి, తట్టుకుని నిలబడే తత్వంతో జనసేన ఆరంభమైంది. జన సైనికులు అన్ సంగ్ హీరోస్. ఆ రోజు నిజాయితీ, నిబద్ధతతోనే ఇప్పటికీ ఉన్నా. ఎన్ని దెబ్బలు తగిలినా విశ్వాసం సన్నగిల్లలేదు. బలపడ్డా కానీ బలహీనపడలేదు.
జనసేన కులం కోసం.. కుటుంబం కోసం.. ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు. ఉద్దానం కిడ్నీ బాధితులను చూసిన తర్వాత నేను రాజకీయ పార్టీ పెట్టడం సరైనదేనని తెలుసుకున్నా. మండల స్థాయి పార్టీపై సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇకపై నేనే మానిటరింగ్ చేస్తా. 2019 లో ఒక్క ఓటమితో చాలా మంది నా నుంచి పారిపోయారు.
విడిగా వెళ్లి ఉంటే ఏం జరుగుతుందో అనే ఛాన్స్ తీసుకోలేదు. కూటమితోనే వెళ్లగా ఇంత మందికి పదవులు వచ్చాయి. సత్ఫలితాలిచ్చే రాజకీయ, అధికార భాగస్వామ్యం కోసం పని చేశా. నేను దారిదోపిడీలు చేయలేదు. కాంట్రాక్టులు చేయలేదు. 2019 నుంచి 2024 వరకు మనల్ని ఎంత నలిపేశారో మీకు తెలుసు.
కమ్యూనిజం కోసం పని చేసిన సోవియట్ రష్యా ప్రజాస్వామ్య దేశాలుగా మారలేదా? మావోయిజం ప్రారంభించిన రెడ్ చైనాలో క్యాపిటలిజం రాలేదా? ప్రపంచమే చాలా మారుతున్నప్పుడు.. మనం మారకూడదా? సంపూర్ణమైన ఆవగాహనతోనే 7 సిద్ధాంతాల కోసం మాట్లాడా. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాల కోసమే నిలబడి చూపించా.. మీరూ నిలబడ్డారు.
ఉత్తి పుణ్యానికి విశాఖలో 15 మంది జనసేన నాయకులపై కేసులు పెట్టారు. ప్రధాని నాకు స్వయంగా తెలిసినా.. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఏరోజు సంప్రదించలేదు. ప్రధానిని సాయం అడిగానంటే నా అంత బలహీనుడు లేడు. దానికంటే పార్టీ మూసేయడమే బెటర్ అనుకున్నా. తప్పు చేస్తే సరిదిద్దుకుంటా.. రౌడీయిజం చేస్తే సహించం.. భయపడం. వీర మహిళలు పేరంటాలకు వెళ్లాలి. అవసరమైతే పోరాటం చేయాలి. జనసేన సభ్యత్వం తీసుకున్న ప్రతీ వారూ ఎదగాలి” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read: అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం, కృష్ణా జలాలను కుప్పంకి తీసుకొచ్చాం- సీఎం చంద్రబాబు