Ap PAC Chairman Race : ఏపీ పీఏసీ ఛైర్మన్ గా పులపర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. వైసీపీకి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో జనసేనకు ఛాన్స్ ఇచ్చారు. జనసేన నుంచి పులపర్తి ఆంజనేయులు పేరును పవన్ కల్యాణ్ సూచించారు. భీమవరం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా పులపర్తి ఆంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ పోటీ నుంచి తప్పుకోకపోతే రేపు పీఏసీ ఛైర్మన్ పదవికి ఓటింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నిక ఉండనుంది.
ఏపీ అసెంబ్లీకి సంబంధించి పీఏసీ కమిటీ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మారాయి. పీఏసీ చైర్మన్ పదవికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ తమ అభ్యర్థిగా పోటీలో నిలిపింది. అయితే, 18 మంది ఓటర్లు ఉంటేనే పదవికి ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. టెక్నికల్ చూస్తే వైసీపీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశమే లేదని స్పష్టమవుతోంది. మండలిలో ముగ్గురికి అవకాశం ఉంటుంది. మండలిలో ముగ్గురిలో ఇద్దరు వైసీపీ అభ్యర్థులు గెలిచేందుకు ఛాన్స్ ఉంది.
ఇప్పటివరకు చూసుకుంటే.. పీఏసీ చైర్మన్ పోస్టుకు శాసనసభ నుంచే అంటే ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే, ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి. 18 మంది ఓటు వేస్తేనే వైసీపీ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ, వైసీపీకి ఏ మాత్రం ఆ అవకాశం లేదు. పెద్దిరెడ్డిని బరిలోకి దింపినా గెలిచే ఛాన్స్ లేదు.
టీడీపీ తరుపు నుంచి శ్రీరామ్ రాజగోపాల్ రెడ్డి, బీవీ నాగేశ్వర్ రెడ్డి, రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, లలితకుమారి నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన తరుపు నుంచి పీఏసీ సభ్యత్వానికి పులపర్తి రామాంజనేయులు నామినేషన్ వేశారు. ఎన్నిక పూర్తైన తర్వాత జనసేనకు చెందిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుకు పీఏసీ ఛైర్మన్ గా అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరుపు నుంచి విష్ణుకుమార్ రాజు ఆశిస్తున్నారు. పీయూసీ చైర్మన్ గా కూన రవికుమార్ కు, ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా జోగేశ్వరరావుకు అవకాశం కలగనుందని సమాచారం. ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకోకుంటే.. 9మంది ఎన్డీయే అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది.
Also Read : మరో పదేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలి..! పవన్ కల్యాణ్ అలా అనడానికి కారణం అదేనా?