JanaSena: మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. వైసీపీలో చేరిన పలువురు జనసేన నేతలు

ప్రస్తుతం ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను రచించుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో..

Jagan

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్‌ కార్యాలయం వేదికగా పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్‌ సుధీర్‌, ఆ పార్టీ స్థానిక నాయకులు యడ్లపల్లి లోకేశ్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీశ్, ప్రసాద్‌ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి వారిని వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. ఆ సమయంలో మంత్రి జోగి రమేశ్ వారితో పాటే ఉన్నారు.

ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కల్యాణ్ ఒక్కరేనని అన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలో ఎవరూ ఉండరని చెప్పారు. చంద్రబాబుని సీఎం చేయడం కోసమే పని చేస్తానని పవన్ చెప్పారంటూ ఆరోపణలు గుప్పించారు. జనసేన కార్యకర్తలను బాలకృష్ణ ఏ విధంగా విమర్శించారో మర్చిపోవద్దని అన్నారు.

అందుకే పార్టీ మారాను: సుధీర్

యడ్లపల్లి రామ్ సుధీర్ మాట్లాడుతూ.. జనసేనలో నాదెండ్ల మనోహర్ ఉన్నంతకాలం ఆ పార్టీ బలపడదని విమర్శించారు. పేదల పక్షాన నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలనే వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎలాంటి పదవి ఇచ్చినా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

జనసేన పార్టీకి కొన్ని వారాల క్రితం నెల్లూరులోనూ షాక్ తగిలిన విషయం తెలిసిందే. కీలక నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆయన అనుచరులు, మద్దతుదారులు కూడా అప్పట్లో వైసీపీలో చేరారు. ఇప్పుడు కృష్ణా జిల్లాలోనూ జనసేనకు షాక్ తగలడం గమనార్హం. ప్రస్తుతం ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను రచించుకుంటున్నాయి.

Also Read: పార్లమెంట్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు కీలక బాధ్యతలు