ప్రభుత్వంపై రాపాక ప్రశంసలు : చప్పట్లు కొట్టిన జగన్

  • Publish Date - January 20, 2020 / 10:48 AM IST

ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మూడు రాజధానుల ప్రతిపాదన వ్యతిరేకించాలని పవన్ రాసిన లేఖను ఆయన పట్టించుకోలేదు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాపాక మద్దతు తెలియచేశారు. రాజధానిపై ప్రజల అభిప్రాయమే తమ అభిప్రాయమన్నారు. మూడు రాజధానులకు ప్రజలు అనుకూలంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులకు ఎక్కడ వెళ్లినా ఆమోదం లభిస్తోందని, ప్రజలంతా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. 

మాట ఇచ్చిన ప్రకారం..పథకాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. 6 లక్షల 50 వేల ఉద్యోగాలు సృష్టించారని, ఇదొక చరిత్ర అని కొనియాడారు. చిన్న వయస్సులో ఉన్న జగన్‌కు అనుభవం లేదని కొంతమంది అంటున్నారని, కానీ..అనుభవం కాదు..చేయాలనే తపన, దృక్పథం ఆయనలో ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల కోసం జగన్ ఆలోచిస్తున్నారని, ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిని అందరూ సపోర్టు చేస్తున్నారని వెల్లడించారు.

ప్రజల్లో ఓటింగ్ పెట్టాలని అంటున్నారని, కానీ ఓటింగ్ పెడితే తెలుస్తుందన్నారు. ప్రజాభిప్రాయం మూడు రాజధానులకు ఉందని, ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి..వారు అలా మాట్లాడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్న యువ ముఖ్యమంత్రిని సపోర్టు చేస్తూ..బిల్లుకు జనసేన పార్టీ నుంచి మద్దతు తెలియచేస్తున్నట్లు రాపాక ప్రకటించారు. 

2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. 

Read More : పవన్‌కు షాక్ : సీఎం జగన్‌కు జై కొట్టిన రాపాక