అభిమానం చాటుకున్న జనసైనికులు.. ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారు

ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి నిత్యం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు.. పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానాల మేరకు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది.

MLA Chirri Balaraju : ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటే పెద్దెత్తున హడావుడి ఉంటుంది. ఎమ్మెల్యే కారుతోపాటు, పక్కన పదుల సంఖ్యలో చోటామోటా నాయకుల కార్లు రయ్ రయ్ మంటూ దూసుకొస్తుంటాయి. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేల పర్యటనల్లో జనాలకంటే కార్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో సొంత కారులేని ఎమ్మెల్యేను చూడటం అంటే చాలా అరుదు అనే చెప్పొచ్చు. మండల స్థాయి ప్రజాప్రతినిధులుసైతం కారు లేనిదే మండలాల్లో పర్యటించని పరిస్థితులున్న రోజుల్లో జనసేన ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పర్యటించటానికి సొంత కారు కూడా లేదు. కారు కొనుగోలు చేసేందుకు ఆర్థిక స్థోమత లేకపోవటంతో సదరు ఎమ్మెల్యే బైక్, ఇతర వాహనాలపైనే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తమ అభిమాన నాయకుడు కారు లేకుండా తిరగడాన్ని జీర్ణించుకోలేకపోయిన జనసేన పార్టీ కార్యకర్తలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read : మంత్రి భార్య తీరుపై చంద్రబాబు సీరియస్.. ఉపేక్షించేది లేదని వార్నింగ్

ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఒక సామాన్య గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. 2019 ఎన్నికల్లో సామాన్య కార్యకర్తగా ఉన్న బాలరాజుకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో బాలరాజు ఓడిపోయాడు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసే, బీజేపీ పొత్తులో భాగంగా పోలవరం నియోజకవర్గం జనసేనకు దక్కింది. దీంతో పవన్ కల్యాణ్ ఆదేశాలతో మరోసారి ఆ నియోజకవర్గం నుంచి కూటమి బలపర్చిన జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

Also Read : టీటీడీలో అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీ.. ఏం జరుగుతుందో తెలుసా?

ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి నిత్యం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు.. పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానాల మేరకు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా కారు అవసరం అవుతుంది. ప్రస్తుత కాలంలో ఎమ్మెల్యే హోదాలో ఉండి సొంతకారులేని వారిని చాలా అరుదుగా చూస్తుంటాం. సామాన్య గిరిజన రైతు కుటుంబం నుంచి వచ్చిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కారు కొనుగోలు చేసే స్థోమతకూడా లేకపోవటంతో కారు లేకుండానే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జనసైనికులు తమ అభిమాన ఎమ్మెల్యేలకు కారును కొనిచ్చేందుకు సిద్ధమయ్యారు. తమకు తోచినంత విరాళాలు వేసుకొని రూ. 10 లక్షలు పోగుచేశారు. 10 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారును కొనిచ్చారు. మిగిలిన సొమ్మును నెలనెలా ఈఎంఐ రూపంలో ఎమ్మెల్యే బాలరాజు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. జనసైనికులు తన పట్ల చూపిన అభిమానానికి ఎమ్మెల్యే బాలరాజు సంతోషం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు