Pawan Kalyan
Janasena : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలోని పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ తెలంగాణలోని పలువురు మంత్రులు, అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు తప్పుబట్టారు. దీంతో పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ యుద్ధానికి దారికితీసే పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ జనసేన పార్టీ అధికారికంగా ఓ ప్రకటన చేసింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వస్తున్న విమర్శలపై జనసేన పార్టీ స్పందించింది. ఈ మేరకు పార్టీ అధికారిక ‘ఎక్స్’ వేదికగా లేఖను విడుదల చేసింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ పేర్కొంది. రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను కొందరు వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం దృష్ట్యా పవన్ మాటలను వక్రీకరించొద్దు అని జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
మాటలను వక్రీకరించవద్దు pic.twitter.com/bFETR1xt5T
— JanaSena Party (@JanaSenaParty) December 2, 2025
పవన్ ఏమన్నారంటే?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించేందుకు అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా భాసిల్లుతున్నాయి. రాష్ట్రం విడిపోవడానికి కారణం వీటి పచ్చదనమే. నిత్యం పచ్చగా ఉంటుందని తెలంగాణ నాయకులంతా అంటారు. ఇప్పుడు కొబ్బరికి దిష్టి తగిలినట్టుంది’’ అని పవన్ అన్నారు. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలోని పలువురు మంత్రులు, అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. పవన్ వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు.
పవన్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ కల్యాణ్ మాట్లాడడం బాధాకరం. కోనసీమకు తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టారనడం అజ్ఞానం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. క్షమాపణ చెప్పకుంటే పవన్ సినిమాలను ఇక్కడ ఆడనివ్వం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
మరో మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉన్న రాష్ట్రాలు. తెలంగాణలోనూ తుఫాన్ వల్ల నష్టం జరిగితే ప్రకృతి విలయం అనుకుంటాం తప్ప ఆంధ్ర ప్రజలను తప్పుపడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే పవన్ కల్యాణ్ తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందని అనడం సరికాదు. ఆయన ఉపముఖ్యమంత్రి హోదాలో కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఇలాంటి వ్యాఖ్యలు సరికావు అని అన్నారు. వీరికితోడు.. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ స్పందించింది. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించొద్దంటూ సూచించింది.