JC Diwakar Reddy and Gangula Pratap Reddy
Kurnool: రాయల తెలంగాణ కావాలని అందుకోసం కృషి చేస్తానని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కృష్ణానది బతికి బట్ట కట్టాలంటే గోదావరి నీరు అవసరమని చెప్పారు. కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వరం ప్రాజక్టును నిర్మించి ఆ నీటిని రాష్ట్ర వ్యాప్తంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పెద్ద మనసుతో ఆలోచించి ఆ నీటిని రాయలసీమ కూడా మళ్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. వేసవికాలం తర్వాత రాయల తెలంగాణకు మద్దతుగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. అందరినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు.
మరోవైపు, రాయలసీమ కర్తవ్య దీక్షలో పాల్గొన్న మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి.. గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని అన్నారు. గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం వస్తే నిధులు, నియామకాలు వస్తాయని చెప్పారు. రాయలసీమలో కష్టపడి కాలువలు సాధించామని.. కానీ, కెనాల్స్ లో పారాల్సిన నీటి పరిస్థితి ఎంటి ? అని నిలదీశారు. రాయలసీమకు ఇప్పటి వరకు సరైన నికర జలాల పంపిణీ జరగలేదని అన్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ మీద ఆరు జిల్లాలు అధారపడి ఉన్నాయని చెప్పారు. అందులో గ్రేటర్ రాయలసీమకు విభజన ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు కేటాయించగా, అందులో దామాషా ప్రకారం సీమకు 300 టీఎంసీలు కేటాయించాలని అన్నారు. పార్టీలకు అతీతంగా సీమలోని నేతలందరూ ఏకం కావలసిన అవసరం వచ్చిందని చెప్పారు.
సిద్ధేశ్వరం బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. రాయలసీమ హక్కులు సాధించుకోవాలంటే ప్రత్యేక రాష్ట్రం ఒకటే మార్గమని చెప్పారు. దేశంలో 30వ రాష్ట్రంగా రాయలసీమను ప్రకటించాలని డిమాండ్ చేశారు. 98 వేల చదరపు కిలో మీటర్ల వైశాల్యంతో దేశంలో 12వ రాష్ట్రంగా గ్రేటర్ రాయలసీమ ఉండాలని చెప్పారు.
జనాభా పరంగా 2 కోట్ల 15 లక్షల మందితో దేశంలో 17వ రాష్ట్రంగా గ్రేటర్ రాయలసీమ నిలుస్తుందన్నారు. సీమకు నీళ్లు ఇస్తే బంగారం పండించి దేశానికి అన్న సీమగా రాయలసీమ మారుతుందని చెప్పుకొచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు రాయలసీమ అని తెలిపారు. సీమ విడిపోయి ప్రత్యేక రాష్ట్రం వైపు అడుగులు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.