JC Prabhakar Reddy
JC Prabhakar Reddy : రాయలసీమ నేతలకు పౌరుషం లేదన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నేను రాయలసీమ బిడ్డనే.. నాకు పౌరుషం ఉంది. కానీ కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాయలసీమకు పౌరుషం లేదని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడటం దురహంకారమని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని జేసీ హెచ్చరించారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఏది చేసినా షో చేస్తాడు.. ఫారిన్ టూర్లు పోయినా ఫోటోలు పెడుతాడు. గుర్రాలు, మినీ కూబర్లు పెట్టుకుని బిల్డప్‌లు చేస్తాడు. ధర్మవరంకు నువ్వు ఏమి చేసినావ్ చెప్పు.. గుడ్ మార్నింగ్ అంటూ షో చేయడం తప్ప ప్రజలకు ఏం చేశారని ఎద్దేవా చేశారు. నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నావ్.. నీకు ఆ అర్హత ఉందా..? అంటూ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ప్రాజెక్టులపై వైసీపీ రాజకీయాలు చేస్తే రైతులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
నీకు, నీ చిన్నాన్నకు జగన్ టికెట్లు ఇవ్వరు.. మీరు రాయలసీమ గురించి మరోసారి మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. నీకు, నీ చిన్నాన్నకు సవాల్ చేస్తున్నా.. రండి చూసుకుందాం. చంద్రబాబు మంచోడు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావ్. మూడేళ్ల తరువాత చూస్తామంటున్నారు.. మేము ఇప్పుడే చూపిస్తాం. అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఏం చేశారు.. జగన్ ఏం చేశారో ప్రజల ముందే తేల్చుకుందాం అంటూ ఛాలెంజ్ విసిరారు. చీము, రక్తం ఉంటే తాడిపత్రికి రావాలని, అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధమేనని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.