Kashmir Terror Attack
Kashmir Terror Attack: జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 26కు చేరింది. దాడిలో గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. ఉగ్రదాడిలో హైదరాబాద్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతిచెందారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్ రంజన్ ను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. మరోవైపు ఏపీకి చెందిన విశాఖ వాసినిసైతం ఉగ్రవాదులు కాల్చి చంపారు.
విశాఖపట్టణంకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమళి ఉగ్రవాదాడిలో మృతిచెందాడు. సమాచారం తెలిసిన వెంటనే విశాఖపట్నం నుంచి కుటుంబ సభ్యులు పహల్గాంకు బయల్దేరి వెళ్లారు. ఉగ్రవాదుల దాడినుంచి తప్పించుకునే ప్రయత్నంలో పారిపోతున్న చంద్రమౌళిని వెంటాడి కాల్చేసినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా మోదీకి చెప్పుకో అంటూ విచక్షణా రహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. చంద్రమౌళిది పాండురంగపురం. దీంతో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలముకున్నాయి.
ఎయిర్‌పోర్టులో మోదీ ఎమర్జెన్సీ భేటీ..
జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటీన భారత్ కు వచ్చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇవాళ ఉదయం 11గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది.