Tadipatri High Tension: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
గతంలో కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు పెద్దారెడ్డి.
సోమవారం ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని కోర్టు ఆదేశించింది. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే.. పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని సూచించింది.
అయితే, పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా 16 నెలలుగా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.
రేపు పెద్దారెడ్డి వస్తున్న సమయంలోనే.. తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ ప్రారంభోత్సవానికి భారీగా తరలి రావాలని పార్టీ శ్రేణులకు జేసీ పిలుపునిచ్చారు.
దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇప్పటికే తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు భారీ ఫోర్స్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఓవైపు పోలీసులు, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి.. దీంతో రేపు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
కాగా, పెద్దారెడ్డిని అనుమతించకపోతే కోర్టు ఆదేశాలు ధిక్కరించినట్టేనా..? అన్న చర్చ జరుగుతోంది.