tiger
Operation Tiger T108 : నంద్యాల జిల్లా ఆపరేషన్ టైగర్ T108లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాలుగు పులిపిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు ఫారెస్టు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రి ఫారెస్టు అధికారులు పులి పిల్లలను కొత్తపల్లి మండలం ముసలపాడు సమీపంలోని అటవీప్రాంతంలోకి తరలించారు. ఫారెస్టు అధికారులు ప్రత్యేక వాహనాల్లో పులి పిల్లలను తీసుకెళ్లారు. దీంతో 72 గంటల ఆపరేషన్ మధర్ టైగర్ సెర్చ్ ఫలించే దిశగా అడుగులు పడుతున్నాయి. నిన్న సాయంత్రం ముసలిమడుగు గ్రామం అడవిముక్కల ప్రాంతంలో పెద్ద పులి సంచారాన్ని గొర్రెల కాపరి గుర్తించారు.
ముసలిమడుగు రేంజ్ దోమకుంట ప్రాంతంలో పెద్ద పులి సంచారాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతానికి పెద్ద పులి పిల్లలను శ్రీనివాస్ నేతృత్వంలో తరలించారు. అయితే మనుషులు తాకిన పిల్లలను తల్లి పులి తన ఒడిలోకి చేర్చుకుంటుందా? లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. తల్లి పులి ఎలా స్పందిస్తోనని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అటు కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో ఆపరేషన్ T108 టైగర్ కొనసాగుతోంది. తొమ్మిది మంది ఫారెస్టు అధికారులతో కమటీ ఏర్పాటు చేశారు.
Tiger Nandyala : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో కనిపించిన పెద్దపులి
ఇప్పటికే 350 సిబ్బంది, 50 మందికి పైగా అటవీ అధికారులతో కొనసాగుతోంది. పులి కూనలను గుర్తించిన ప్రాంతానికి కొంత దూరంలో పెద్దపులి పాద ముద్రలు ఉన్నాయి. ఈ పాదముద్రలు తల్లి పులివా కాదా? అనే అంశాన్ని శాస్త్రీయంగా అటవీ శాఖ అధికారులు తేల్చనున్నారు. మనుషుల స్పర్శ తగిలిన పులి కూనలను తల్లి దగ్గరకు రానివ్వదు. గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పులి క్రూర మృగం.. వేటే దాని ప్రధాన లక్షణం.
తల్లికి దూరమైన పులి పిల్లలు అటవీ అధికారులు ఇచ్చిన పాలు తాగుతున్నాయి. పెట్టిన ఆహారం తింటున్నాయి. వాటి ఆలనా పాలనా అధికారులు చూస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దీంతో అవి క్రూరత్వాన్ని కోల్పోయి సాధు జంతువుగా మారొచ్చని తల్లి పులి భావిస్తుందని అధికారులు చెబుతున్నారు. అందుకే ఒక్క సారి దూరమైన పిల్లలను తల్లి పులి మళ్లీ దగ్గరకు చేర్చుకోదని భావిస్తున్నారు. ఈ కారణంగానే జూకు తరలించాలని ప్రతిపాదించారు.