Viveka murder : వివేకా హత్య కేసులో కీలక మలుపు-ప్రాణహాని ఉందంటూ ఎస్పీకి సునీత లేఖ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ పులివెందుల పోలీసులు మణికంఠరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Vivekananda Reddy murder case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ పులివెందుల పోలీసులు మణికంఠరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈనెల పదవ తేదీన వైఎస్‌ వివేకా ఇంటి వద్ద మణికంఠరెడ్డి రెక్కీ నిర్వహించినట్టు వివేకా కూతురు సునీత ఆరోపించారు. అలాగే వివేకా హత్య కేసు నిందితులతో తనకు ప్రాణహాని ఉందంటూ నిన్న ఎస్పీకి లేఖ రాశారు.

ఈ కేసును ఇక్కడితో వదిలేయాలని బెదిరిస్తున్నారంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని సైతం ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ.. భద్రత పెంచారు. సునీతారెడ్డి ఇంటి వద్ద పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఇటు మణికంఠరెడ్డిని పులివెందుల పోలీసులు విచారిస్తున్నారు.

వివేకా హత్య కేసును ఛేదించాలంటూ సునీతా రెడ్డి చాలా రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో సీబీఐ ఎంక్వేరికి ఆదేశించింది హైకోర్టు. సీబీఐ అధికారులు దర్యాప్తు స్పీడప్ చేయడంతో.. హత్య సూత్రదారులు ఎవరనేదీ ఇప్పడిప్పుడే తేలుతోంది. ప్రధాన అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. అయితే, తనకే బెదిరింపులు వస్తున్నాయని.. ఈ కేసును ఇక్కడితో వదిలేయాలంటూ తనను బెదిరిస్తున్నారంటూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప జిల్లా ఎస్పీకి వైఎస్‌ సునీతా రెడ్డి లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు.ఈ నెల 10న సాయంత్రం ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తరువాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌ చేశాడని లేఖలో సునీత పేర్కొన్నారు. శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని వివరించారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని ఆమె జిల్లా ఎస్పీని కోరారు. అయితే, వివేకా హత్య కేసులో నిన్ననే సీబీఐ విచారణకు శివశంకర్‌రెడ్డి హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు