Key orders of AP government : అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయన విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కమిటీ ఛైర్మన్ గా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. అధ్యయనం చేసి ఏఏ భవనాలు అవసరమో..కమిటీ తేల్చనుంది. సచివాలయం, హెచ్ వోడీ టవర్స్, హైకోర్టు భవనాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించుకోవడం కోసం కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. అమరావతిలో చేపట్టిన నిర్మాణాల పురోగతి, అయిన వ్యయం, భవనాల పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై ఇప్పటికే సీఎం జగన్ ఆరా తీసిన సంగతి తెలిసిందే.
ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు సీఎం జగన్ పలు హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అందులో ప్రధానమైంది నవరత్నాలు. అయితే..ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడనుందని, అందుకే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. శాశ్వత భవనాల పేరిట కోట్ల రూపాయలు అప్పులు తేవడం ఇబ్బందిగా మారుతుందని, సంక్షేమం, అభివృద్ధి మీద దృష్టి పెట్టి..పాలన సవ్యంగా జరిగేలా..ఆర్థికంగా వెసులుబాటు సమకూర్చుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో..అమరావతి శాశ్వత కట్టడాల విషయంలో కొంత వెనక్కి వెళుతారనే ప్రచారం జరగుతోంది. ఇప్పుడున్న భవనాల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం.