Gold Silver Seized
Gold Silver Seized : ఏలూరు జిల్లాలో 16 కేజీల బంగారం, 35 కిలోల వెండిని పోలీసులు సీజ్ చేశారు. పెదపాడు మండలం కలపర్రు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యానులో భారీగా బంగారం ఆభరణాలను, వెండి వస్తువులను గుర్తించారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు.
ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైవేలు, రహదారులపై పెద్ద ఎత్తున చెక్ పోస్టుల ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాహనాలు చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం ఆకివీడులోనూ పెద్ద మొత్తంలో డబ్బును సీజ్ చేశారు. స్కూటీలో తరలిస్తున్న 12లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదపాడు మండలం కలపర్రు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీలు చేస్తుండగా పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యానులో వీటిని తరలిస్తున్నారు.
దాదాపు 15లక్షల రూపాయల నగదు కూడా అందులో ఉంది. దీనికి సంబంధించి పత్రాలు, ఆధారాలు చూపించాలని పోలీసులు అడిగారు. అయితే, వ్యానులో ఉన్న వ్యక్తులు సరైన పత్రాలు చూపించలేదు, సరైన సమాధానం కూడా చెప్పలేదు. దీంతో పోలీసులు నగలు, నగదును సీజ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. దీనికి సంబంధించి జాయింట్ కలెక్టర్ వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడి నుంచి బంగారం తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే దానిపై దర్యాఫ్తు జరుపుతున్నారు. కాగా.. ఎన్నికల వేళ కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది.
విజయవాడ నుంచి తీసుకొచ్చి ఏలూరులోని జువెలరీ షాపులకు ఈ ఆభరణాలను తరలిస్తున్నట్లు వాహనం డ్రైవర్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పత్రాలు కానీ ఆధారాలు కానీ అతడు చూపించలేదు. దీంతో పోలీసులు నగలు, నగదును సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు. నిన్న జంగారెడ్డిగూడెంలో కార్గో సర్వీస్ లో 22లక్షల రూపాయలు పట్టుబడింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. మొత్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో 50లక్షల రూపాయల నగదు, పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడటం సంచలనంగా మారింది. అధికారులు అప్రమత్తం అయ్యారు. తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా చెక్ చేస్తున్నారు.
Also Read : నా వద్ద ఆధారాలున్నాయ్.. అన్నీ బయటపెడతా.. పవన్ కల్యాణ్ పై పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు