Kinjarapu Atchannaidu On Chandrababu Letter (Photo : Google)
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కమ్మ సామాజికవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ లేఖ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రాజకీయవర్గాల్లో దుమారం రేగింది. ఈ వ్యవహారం చర్చకు దారితీయడంతో దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఆ లేఖ ఫేక్ అని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. దీన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు.
తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు ఎవరికీ ఎలాంటి సూచనలు చేయలేదని క్లారిటీ ఇచ్చారాయన. చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని, వారే ఈ దొంగ లేఖను సృష్టించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగు దేశం దూరంగా ఉందని ఆయన గుర్తు చేశారు.
Also Read : ముందు రోజు బీజేపీ.. తర్వాతి రోజు జనసేన అభ్యర్థి.. ఎవరీ ముమ్మారెడ్డి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి? అనే దానిపై పార్టీ కార్యకర్తలకు గానీ, అభిమానులకు గానీ, టీడీపీ మద్దతుదారులకు గానీ చంద్రబాబు నాయుడు ఎటువంటి సూచనలు చేయలేదని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ లేఖలో చంద్రబాబు సంతకం సైతం ఫోర్జరీ చేశారని ఆయన చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు అచ్చెన్నాయుడు.
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన విషయం విదితమే.
Also Read : ఈసారి గెలుపు ఖాయం, డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం- బండ్ల గణేష్ జోస్యం