Kukatpally : ముందు రోజు బీజేపీ.. తర్వాతి రోజు జనసేన అభ్యర్థి.. ఎవరీ ముమ్మారెడ్డి?

కూకట్‌పల్లి జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.. మొన్నటి వరకు బీజేపీ ఉండి, లేటెస్ట్ గా పవన్ పార్టీలో చేరి టిక్కెట్ సంపాదించారు.

Kukatpally : ముందు రోజు బీజేపీ.. తర్వాతి రోజు జనసేన అభ్యర్థి.. ఎవరీ ముమ్మారెడ్డి?

kukatpally janasena candidate mummareddy prem kumar personal deatils

Updated On : November 8, 2023 / 1:42 PM IST

Mummareddy Prem Kumar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను జనసేన పార్టీ ఖరారు చేసింది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 స్థానాలను జనసేన దక్కించుకుంది. ముందు నుంచి అడుగుతున్న కూకట్‌పల్లి నియోజవర్గాన్ని జనసేన నిలుపుకోగలిగింది. ఇక్కడ నుంచి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ను పోటీకి నిలిపింది. ఒక రోజు ముందే ఆయన జనసేన పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకోవడం గమనార్హం. బీజేపీ నుంచి సోమవారం జనసేన చేరిన ఆయనకు మంగళవారం టిక్కెట్ ఖరారైంది.

57 ఏళ్ల ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ విద్యాధికుడు. ఆయన ఎంకామ్, ఎంబీఏ చదివారు. ఆయన భార్య పేరు విజయలక్ష్మి. వీరికి ఇద్దరు కుమార్తెలు డాక్టర్ తేజశ్రీ, హేమశ్రీ ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఇక పొలిటికల్ కెరీర్ చూస్తే.. ముమ్మారెడ్డి ముందుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. నందమూరి సుహాసినికి టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో ఆమెకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.

ముమ్మారెడ్డి ఈ ఏడాది ఆగస్టులో ఆయన బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తూ కూకట్‌పల్లి టికెట్ రేసులో నిలిచారు. బీజేపీ టిక్కెట్ తనకే వస్తుందని ఆయన భావించారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించింది బీజేపీ. ఈ విషయాన్ని ముందే అంచనా వేసిన చాకచక్యంగా జనసేన పార్టీలో చేరి టిక్కెట్ సంపాదించారు. మొత్తానికి ఎలాగైతే టికెట్ సాధించి కూకట్‌పల్లి నుంచి బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికార బీఆర్ఎస్ తరపున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బండి రమేశ్ పోటీ చేస్తున్నారు.

Also Read: జనసేన అభ్యర్థుల జాబితా విడుదల.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..