Bandla Ganesh : ఈసారి గెలుపు ఖాయం, డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం- బండ్ల గణేష్ జోస్యం

Bandla Ganesh On Congress Win : ప్రజలు డిసైడ్ అయ్యారు. అందరూ డిసెంబర్ 3 కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరు ఏం ఇచ్చినా.. కాంగ్రెస్‌కి ఓటేస్తారు.

Bandla Ganesh : ఈసారి గెలుపు ఖాయం, డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం- బండ్ల గణేష్ జోస్యం

Bandla Ganesh On Congress Win (Photo : Google)

Updated On : November 8, 2023 / 8:05 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈసారి ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? అనేది ఉత్కంఠగా మారింది. కాగా, గెలుపుపై అన్ని పార్టీలు నమ్మకంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అంటున్నాయి. ఫైనల్ గా ఓటర్ తీర్పు ఎలా ఉంటుంది అని తెలియాలంటే డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే.. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో గెలిచేది ఎవరో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో ఆయన చెప్పేశారు.

Also Read : ముందు రోజు బీజేపీ.. తర్వాతి రోజు జనసేన అభ్యర్థి.. ఎవరీ ముమ్మారెడ్డి?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అని బండ్ల గణేశ్ జోస్యం చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ విజయంపై నమ్మకంగా ఉన్నారు. తెలంగాణలో ఎక్కడికి పోయినా కాంగ్రెస్ అంటున్నారని, కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని బండ్ల గణేశ్ అన్నారు. ”ప్రజలు డిసైడ్ అయ్యారు. అందరూ డిసెంబర్ 3 కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరు ఏం ఇచ్చినా.. కాంగ్రెస్‌కి ఓటేస్తారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, సోనియా గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ దూసుకుపోతుంది. బుల్లెట్‌లా రేవంత్ దూసుకుపోతున్నారు” అని బండ్ల గణేశ్ అన్నారు.

”జనాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సోషల్ మీడియాని, నాయకులను మేనేజ్ చేయచ్చు. కానీ ప్రజలను మేనేజ్ చేయలేరు. 2023, నవంబర్ 30వ తేదీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అద్భుతం సృష్టించబోతుంది. దేశం కోసం రాజీవ్ గాంధీ దేహం ముక్కలైంది. ఆయన దేహం ముక్కలు ఏరుకుని రాహుల్‌ గాంధీ స్మశానికి వెళ్లారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కల కోసం కాంగ్రెస్‌ని గెలిపించాలి. రాహుల్ గాంధీ ఎవడు అని అహంకారంతో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నా శ్వాస కాంగ్రెస్. నా మాట కాంగ్రెస్. అయ్యప్ప మాలతో చెబుతున్నా. కాంగ్రెస్ తెలంగాణను ఏలాలి” అని బండ్ల గణేశ్ అన్నారు.

Also Read : రేవంత్ రెడ్డిని సీఎం చేయమని బండ్ల గణేష్ సహా పలువురు నాకు ఫోన్లు చేస్తున్నారు : కేఏ పాల్

గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉన్న మహాకూటమికి మద్దతుగా ప్రచారం చేశారు బండ్ల గణేశ్. కాంగ్రెస్ విజయం చాలా కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు. అంతేకాదు ఈసారి కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని సవాల్ కూడా చేశారు. ఆయన సవాల్.. బ్లేడ్ చాలెంజ్ గా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. బ్లేడ్ చాలెంజ్ ను అడ్డం పెట్టుకుని నెటిజన్లు బండ్లను తెగ ట్రోల్ చేశారు. ఆయనను ఓ ఆటాడేసుకున్నారు. ఒకానొక సమయంలో ఏదో ఫ్లో లో అలా అన్నాను, ఇకనైనా నన్ను వదిలేయండి మహాప్రభో అని బండ్ల గణేశ్ వేడుకోవాల్సి వచ్చింది. అయితే, కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. రాజకీయాలతో తనకు సంబంధం లేదని బండ్ల గణేశ్ ప్రకటించారు. అయితే ఇటీవలి కాలంలో మళ్లీ పాలిటిక్స్ లో జోక్యం చేసుకుంటున్నారు. మళ్లీ కాంగ్రెస్ కు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు బండ్ల గణేశ్.