Kiran Kumar Reddy
Kiran Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ… తన తమ్ముడు టీడీపీలోకి వెళ్లినప్పటి నుంచి తాను అతడి ఇంటికి వెళ్లలేదని తెలిపారు.
“గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ లోనే నేను, నా కుటుంబం కొనసాగాం. రాష్ట్ర విభజనతో పార్టీకి, పదవికి రాజీనామా చేశాను. నాలుగేళ్ల తర్వాత వాళ్లు వచ్చి అడిగితేనే మళ్లీ నేను కాంగ్రెస్ లో చేరాను. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ అడిగి ప్రజాభిప్రాయం మేరకు తీసుకోవాలి. నిర్ణయం సరైంది తీసుకోకుంటే తప్పు చేశామని సరిదిద్దుకోవాలి.. అందుకే కాంగ్రెస్ లో చేరాను.
కాంగ్రెస్ లో నిర్ణయాలు ప్రతి రాష్ట్రంలో దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పద్ధతులు చూశాక అక్కడ ఇమడలేకపోయాను. మోదీ నాయకత్వాన్ని చూసి ప్రజలకు చేస్తున్న మంచి చూసి పార్టీలో చేరాను. ఏపీ, తెలంగాణాలో నా సేవలు ఉంటాయి. ఇంక కాంగ్రెస్ బలోపేతం కాదు.. కాంగ్రెస్ తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్రానికి వ్యతిరేకంగానే ఉంటుంది. ప్రభుత్వ పాలనాతీరుపై మరోసారి మాట్లాడతా.
బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తా. విభజన హామీలు అమలు కాలేదనే నేను రాజీనామా చేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఏమైనా దెబ్బతిందా? ఇప్పుడే ఎందుకు అరెస్టులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగడం లేదు. ఇనుము కొనుగోలుకు సంబంధించి టెండర్లు పిలిచారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావాలి. అలా ఎలా అన్నది ఆలోచిస్తున్నారు. ఎక్కడ పార్టీ నన్ను పనిచేయమంటే అక్కడ పనిచేస్తా. నేను పదవి ఆశించి బీజేపీలో చేరలేదు. కష్టపడి పనిచేస్తే పదవులు అవే వస్తాయి” అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.