Kodali Nani
వైసీపీ సర్కారు, సీఎం జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ తగాదాలు ఏవైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పదిమంది పనికిమాలిన వ్యక్తులను వెనకవేసుకొని, వైఎస్సార్ బిడ్డ అంటూ తెలంగాణలో షర్మిల పరువు తీసుకున్నారని కొడాలి నాని చెప్పారు. ఏపీలోనూ అదే పనిచేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఏం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని షర్మిల మాట్లాడుతున్నారని అన్నారు. ఎంపీగా కూడా గెలుస్తారో లేదో తెలియని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్ర సమస్యలు ఎలా పరిష్కరిస్తారని నిలదీశారు.
రాజకీయ లబ్ధి కోసమే జగన్‌పై షర్మిల ఆరోపణలు చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. షర్మిల పాదయాత్ర చేసినప్పటికీ ఏపీలో 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందా? అని అన్నారు. ఓటమి తర్వాత షర్మిల ఎక్కడైనా కనిపించారా? అని అడిగారు. గత ఏపీ ఎన్నికల్లో ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో ఎప్పుడైనా మాట్లాడిందా అని కొడాలి నాని నిలదీశారు. ఏపీలో ఏం జరుగుతుందో అవగాహనలేని షర్మిల ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడం దారుణమని చెప్పారు.