MLA Balineni SrinivasReddy : కొలిక్కి వచ్చిన ఒంగోలు పంచాయితీ.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. ఎంపీ అభ్యర్థిగా ఎవరొచ్చినా ఒకేనన్న బాలినేని
ఒంగోలు ఎంపీ పంచాయతీ కొలిక్కి వచ్చింది. మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అధిష్టానం బుజ్జగించడంతో మెత్తపడ్డారు.

MLA Balineni SrinivasReddy
Ongole YSRCP MLA : ఒంగోలు ఎంపీ పంచాయతీ కొలిక్కి వచ్చింది. మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అధిష్టానం బుజ్జగించడంతో మెత్తపడ్డారు. ఇన్నాళ్లూ ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డే పోటీ చేయాలని అధిష్టానం వద్ద పట్టుబట్టిన బాలినేని.. ప్రస్తుతం.. ఒంగోలు ఎంపీగా ఎవరు వచ్చినా ఒకేనని చెప్పేశారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అనేశారు. దీంతో కొద్దిరోజులుగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం సీటు విషయంపై కొనసాగుతున్న రగడ బాలినేని తాజా వ్యాఖ్యలతో తెరపడినట్లయిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. ఒంగోలులో 25వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేయాలనేది నా ఆశ అని అన్నారు.
ఒంగోలు ఎంపీ సీటు విషయంలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు బాగుంటుందనే సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికోసం ప్రయత్నం చేశానని, కానీ, మిగతా నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు, ఎమ్మెల్యేలు పట్టీపట్టనట్టుగా ఉన్నారని అన్నారు. అధిష్టానం దృష్టిలో నేను ఒక్కడినే ప్రశ్నించినట్లవుతోందని, ఇకనుంచి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బాలినేని అన్నారు. నేను అందరి శ్రేయస్సుకోసం అడుగుతున్నా.. మిగతా వాళ్లకు పట్టనప్పుడు నాకు మాత్రం ఎందుకు, నా ఒంగోలు నియోజకవర్గ పేదల పట్టాలకోసం ప్రయత్నం చేసుకున్నా అని బాలినేని పేర్కొన్నారు.
Also Read : Panjagutta PS : హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. పంజాగుట్ట పీఎస్ లో సిబ్బంది మొత్తం బదిలీ.. కారణమేమిటంటే?
ఎంపీ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు పట్టించుకోనప్పుడు నాకు మాత్రం ఎందుకు అంటూ బాలినేని కొంత అసహనం వ్యక్తం చేశారు. నేను సీఎం పిలిస్తే వెళ్లనన్నానని చెప్పడం కరెక్ట్ కాదు.. నేను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవం అని బాలినేని తెలిపారు. నేను ఏ మీడియాతో మాట్లాడలేదు.. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుని రాసుకుంటున్నారని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒంగోలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం పనిచేస్తా.. ఏ ఎంపీ అభ్యర్థి వచ్చినా నాకు ఏ అభ్యంతరం లేదు.. నా పనిని నేను చేసుకుంటూ వెళ్తానంటూ బాలినేని స్పష్టం చేశారు.