Krishna SP Jashuava : పట్టాభిని పోలీసులు కొట్టారనే ఆరోపణ అవాస్తవం : ఎస్పీ జాషువా

గన్నవరం సంఘటన పరిణామాలపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టాభి రామ్ ను పోలీసులు కొట్టారనే ఆరోపణ అవాస్తవం అన్నారు. తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నింద వేయడం తగదని హితవుపలికారు.

SP Jashuava

Krishna SP Jashuava : గన్నవరం సంఘటన పరిణామాలపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టాభి రామ్ ను పోలీసులు కొట్టారనే ఆరోపణ అవాస్తవం అన్నారు. తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నింద వేయడం తగదని హితవుపలికారు. పట్టాభి అవాస్తవాలు చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించాలని చూశారని పేర్కొన్నారు. రెండు మార్లు డాక్టర్ల బృందం పరీక్షించినా ఎటువంటి గాయం లేకపోవడంతో పట్టాభి వ్యూహం విఫలమైందన్నారు. ఇన్స్పెక్టర్ కనకరావు గాయపడిన సంఘటనపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. దీనికి ఏం సమాధానం చెపుతారు అని అన్నారు.

ఇన్స్పెక్టర్ కనకరావు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలుసు.. ఇప్పుడు కొత్తగా కొందరు నాయకులు ఆయన బీసీ అనే వివాదాన్ని లేపడం అర్ధ రహితమన్నారు. ఇన్స్పెక్టర్ కనకరావు కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇకనైనా అవాస్తవాలను ప్రాచుర్యం చేయడం ఆపి, కోర్టు ఆదేశాలను గౌరవించండి అని సూచించారు. గౌరవ కోర్టు వారు పట్టాభి, ఇతర నిందితులను రిమాండ్ కు పంపడం, దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందనడానికి నిదర్శనమన్నారు.

Pattabhi Shifted Rajahmundry Central Jail : టీడీపీ నేత పట్టాభి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

లేనిపోని అభాండాలు వేయడం ద్వారా పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తియ్యలేరని స్పష్టం చేశారు. ఎటువంటి దురుద్దేశాలు లేకపోతే పట్టాభి మూడు వాహనాల నిండా మనుషులతో గన్నవరం ఎందుకు వచ్చాడు అని ప్రశ్నించారు. వచ్చీ రాగానే మరింత మంది జనాలను పోగేసి పోలీస్ అధికారులతో వాగ్వివాదానికి దిగాడని పేర్కొన్నారు. పట్టాభి ప్రవర్తనలో గొడవలు సృష్టించాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

ఇంతవరకూ తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో ఫిర్యాదు ఇవ్వలేదన్నారు. అయినా పోలీసులు, రాయిటింగ్, అర్సన్ వంటి కఠినమైన సెక్షన్లతో సూమోటోగా కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితులను వీడియో ఫుటేజీ ద్వారా గుర్తించి, ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన ముద్దాయిలను గుర్తించి, అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు.