కృష్ణా నది జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, నీటి వాటాల లెక్క తేల్చే పనిలో (కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ) పడింది. తెలంగాణలో అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్న ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుతో కేఆర్ ఎంబీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏపీ చెబుతున్న ప్రాజెక్టుల వివరాలతోపాటు డీపీఆర్ లు సమర్పించాలని ఆదేశించింది.
తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదుపై కేఆర్ ఎంబీ స్పందించింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ ఎల్ బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్లి ఎత్తిపోతల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అంతేకాదు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లు కూడా సమర్పించాలని కూడా ఆదేశించింది.
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు నిర్మించే ముందు కృష్ణా, గోదావరి బోర్డుల అనుమతి తప్పనిసరి. ఇష్టానుసారంగా నిర్మిస్తే నీటి వాటాల్లో అభ్యంతరాలు, సమస్యలు ఉత్పన్నమవుతాయని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది.
ప్రాజెక్టులకు సబంధించి డీపీఆర్ లు సమర్పించాలని గతంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు గుర్తు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత అపెక్స్ కౌన్సిల్ ముందస్తు ఆమోదం లేకుండా తెలంగాణ గానీ, ఏపీ గానీ కొత్త ప్రాజెక్టుల తెచ్చే వీల్లేదన్నారు. అలాగే అపెక్స్ కౌన్సిల్ కంటే ముందే కృష్ణా, గోదావరి బోర్డుల అనుమతి తీసుకోవాలన్నారు.
నీటి వాటాల ఆధారంగా ఇరు రాష్ట్రాలు ముందుకెళ్లాల్సివుంటుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను వీలైనంత త్వరగా పంపించాలని తెలంగాణకు తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కొత్త ప్రాజెక్టులు చేపట్టిందిన..ఈ కారణంగా 150.53 టీఎంసీల నీటి తరలింపు జరిగిందని ఏపీ అధికారులు కృష్ణా, గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేశారు.
గోదావరి నదిపై కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం లాంటి ప్రాజెక్టులు చేపట్టిందని వివరించారు. ఏ ఏ ప్రాజెక్టు కింద ఏ మేరకు నీటి వినియోగం జరుగుతుందనే వివరాలను లేఖ రూపంలో అందజేశారు. దీనిపై స్పందించిన కేఆర్ ఎంబీ ప్రాజెక్టుల వివరాలు అందివ్వాలని తెలంగాణను కోరింది. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Read:వాహనదారులకు గమనిక : సైబరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే