×
Ad

Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి.. మృతుల కుటుంబాలకు పరిహారం..

Kurnool Bus Accident : కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న

Kurnool Bus Accident

Kurnool Bus Accident : కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు ఇంధన ట్యాంకర్ ను బైక్ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా మృతిచెందారు.

ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సానుభూతి ప్రకటించిన ప్రధాని.. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటన విచారకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతులకు సంతాపం ప్రకటించారు.


కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవదహనమవడం అత్యంత విషాదకరమని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఘోర ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరుతూ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ లతో రేవంత్ మాట్లాడారు. సహాయక చర్యలకోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని గద్వాల్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.


ఘటన ఎంతో బాధించింది – మంత్రి లోకేశ్
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురికావడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన ఎంతో బాధించిందని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి..
కర్నూల్ జిల్లాలో బస్సు ప్రమాదంపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు. మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.