×
Ad

Kurnool Bus Tragedy : కర్నూలు బస్సు ప్రమాదం.. వెలుగులోకి కొత్త విషయాలు.. బైక్‌ను ఢీకొట్టింది ఆ బస్సు కాదా..? డ్రైవర్ వాదన మరోలా..

Kurnool Bus Tragedy : కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, బస్సు ప్రమాద ఘటనపై ..

Kurnool Bus Tragedy

Kurnool Bus Tragedy: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు -చెట్లమల్లాపురం మధ్య జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తరువాత బస్సుకు ఒక్కసారిగా మంటలు వ్యాపించి తగలబడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 19మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. గాఢనిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టడంతో ఏం జరిగిందో కూడా అర్ధంకాని పరిస్థితి. ఫోరెన్సింక్ బృందాలు రంగంలోకి దిగి మృతదేహాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. బస్సు ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 41మంది ప్రయాణీకులు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాద ఘటనపై 16 బృందాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

Also Read: Kurnool Bus Accident : కర్నూల్‌లో ప్రమాదానికి గురైన బస్సుపై 16చలాన్లు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ప్రమాదం అందుకే జరిగిందా..? మంత్రి పొన్నం కీలక కామెంట్స్..

మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఆరుగురు ఉండగా.. తెలంగాణ రాష్ట్రంకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. అదేవిధగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చొప్పున ఉన్నారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

బైక్‌ను ఢీకొట్టడం వల్లనే బస్సుకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తుండగా.. డ్రైవర్ వాదన మరోలా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య పరారయ్యాడు. ప్రత్యామ్నాయ డ్రైవర్ శివ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే, శివ ప్రమాదం గురించి పోలీసులకు మరో వాదన వినిపించాడు.

ద్విచక్ర వాహనదారుడిని అంతకుముందే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతని మృతదేహం రోడ్డు పక్కన పడి ఉందని, ద్విచక్ర వాహనం మాత్రమే రోడ్డు మధ్యలో పడి ఉందని తెలిపాడు. మా బస్సు వేగంగా వెళ్తున్న క్రమంలో దగ్గరికి వచ్చేవరకు రోడ్డుపై పడిఉన్న ద్విచక్ర వాహనాన్ని గుర్తించలేక పోయామని, దగ్గరికి వచ్చిన తరువాత రోడ్డుపై బైక్ కనిపించడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసేందుకు ప్రయత్నం చేశాడు. కానీ, అలా చేస్తే బస్సులోని వారిని ప్రమాదం ఉంటుందని భావించి బస్సును బైక్ పై నుంచి పోనిచ్చే ప్రయత్నం చేశాం.

బైక్ బస్సు కింద ఇరుక్కు పోవడంతో ముందుకు వెళ్లలేక పోయాం. మా బస్సే ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లయితే శివశంకర్ మృతదేహం కూడా బస్సు కింద పడి నుజ్జునుజ్జు అయ్యేదని శివ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.