Kurnool Bus Accident : కర్నూల్‌లో ప్రమాదానికి గురైన బస్సుపై 16చలాన్లు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ప్రమాదం అందుకే జరిగిందా..? మంత్రి పొన్నం కీలక కామెంట్స్..

Kurnool Bus Accident : కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ..

Kurnool Bus Accident : కర్నూల్‌లో ప్రమాదానికి గురైన బస్సుపై 16చలాన్లు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ప్రమాదం అందుకే జరిగిందా..? మంత్రి పొన్నం కీలక కామెంట్స్..

Kurnool Bus Accident

Updated On : October 24, 2025 / 12:25 PM IST

Kurnool Bus Accident : కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 41మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ప్రయాణికుల్లో 20మంది సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఫోరెన్సిక్ బృందం బస్సులో నుంచి 19మృతదేహాలు వెలికి తీశారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ఇదిలాఉంటే.. ప్రమాదానికి గురైన బస్సు కండీషన్, బస్సుపై చలాన్ల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రమాదానికి గురైన బస్సుపై భారీగా ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. 2024 జనవరి నుంచి చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రూ. 23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది జనవరి 27వ తేదీ నుంచి ఈ ఏడాది అక్టోబర్ 9వ తేదీ వరకు 16సార్లు బస్సు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిసింది. తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లలోకి ప్రవేశించడంతోనూ ఈ బస్సుపై జరిమానాలు పడ్డాయి. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైనా చలాన్లు పడినట్లు తెలిసింది.

Also Read: Kurnool Bus Accident : కర్నూలులో బస్సు ప్రమాదం.. మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఇదే.. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు

ప్రమాదానికి గురైన బస్సు DD01 N9490 నెంబర్‌తో రిజిస్టర్ అయినట్లు ఏపీ రవాణా శాఖ అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌నెస్ గడువు ముగిసిందని తేలింది. అంతేకాదు ఇన్సూరెన్స్ పాలసీ, టాక్స్ కూడా గతేడాది‌తో ముగిసిందని తెలిసింది. ఇక పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. దాదాపు అన్ని చలాన్లు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నిరవారణకు చర్యలు తీసుకుంటామని ఏపీ రవాణా శాఖ అధికారులు తెలిపారు.

రూల్స్ పాటించకపోతే ట్రావెల్స్ యజమానులను జైలుకు పంపిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్
కర్నూల్ జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కర్నూల్ లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్న. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలిఫోన్లో మాట్లాడడం జరిగిందని మంత్రి పొన్నం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. త్వరలో ఆంధ్ర‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులం రవాణా శాఖ కమిషనర్లు సమావేశం ఏర్పాటు చేస్తాం. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది.. ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం. బస్సులపై రోజువారి రవాణా శాఖ చెక్ చేస్తే వేధింపులు అంటున్నారు. కానీ, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. హైదరాబాదు నుండి బెంగళూరు తిరుగుతుంది.

బస్సు ఓనర్లు, ట్రావెల్స్ కు సంబంధించిన వారికి రవాణా శాఖ తరపున హెచ్చరిక చేస్తున్నా.. బస్సు ఫిట్ నెస్, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై నిర్లక్ష్యం వహిస్తే నేరుగా హత్యానేరం కింద జైలుకు పంపిస్తామని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పొన్నం అన్నారు. క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరామని, పూర్తి వివరాలు వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.