Kurnool Bus Tragedy
Kurnool Bus Tragedy : హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు శుక్రవారం తెల్లవారు జామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణీకులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు.
ప్రమాదం తరువాత 27మంది ప్రాణాలతో బయటపడగా.. 19మంది సజీవదహనం అయ్యారు. అయితే, బస్సు అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించిన కొత్త కోణాన్ని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి.
ట్రావెల్స్ బస్సులో మంటలు ఒక్కసారిగా వ్యాపించడానికి ప్రధాన కారణం సెల్ ఫోన్లు అని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి. ప్రమాదం సందర్భంగా ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది.
ఆ క్రమంలో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్త తొలుత లగేజీ క్యాబిన్ కు అంటుకున్నాయి. అందులోని 400కుపైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్శిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఈ పేలుడు కారణంగా బస్సులో మంటలు వేగంగా వ్యాపించాని ఫోరెన్సిక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫోన్ బ్యాటరీలన్ని ఒకేసారి పేలడంతో మంటలు తీవ్రత ఎక్కువై బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి. అప్పటికే బస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయాణీకులు లేచిచూసే సరికి దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. తప్పించుకునే ప్రయత్నం చేసినా బస్సు డోర్ తెచుకోకపోవటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొందరు బస్సు ఎమర్జెన్సీ అద్దాలను పగలగొట్టి బయటకు దూకారు. అయితే, ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది.