Kuyyeru Mother Daughter Incident : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్లు ఇంట్లోనే. అదీ ఒక మూల గదిలోనే. ఇంటి నుంచి బయటికి వచ్చింది లేదు, ఎవరినీ పలకరించింది లేదు. ఎంతసేపూ గదిలోనే, దుప్పటిలోనే. ఇదీ కాకినాడ జిల్లా కుయ్యేరులో తల్లీకూతుళ్ల పరిస్థితి. ఎవరు ఎంత చెప్పినా ఆ ఇద్దరు వినిపించుకోలేదు.
ఇంట్లో నుంచి బయటకు వచ్చేది లేదని తెగేసి చెప్పారు. బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు, ఏఎన్ ఎంలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వారి తరం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో ఉదయం నుంచి నెలకొన్న హైడ్రామాకు తెరపడింది. కథ సుఖాంతం అయ్యింది. తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు.. తల్లీకూతుళ్లను బయటకు తీసుకొచ్చారు. వారికి నచ్చ చెప్పి ఆసుపత్రికి తరలించారు.
చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే తల్లీకూతుళ్లు అస్సలు రానివ్వరు. వారి ఇంట్లోకి గ్రామస్తులకు నో ఎంట్రీ. కేవలం ఇంటి పెద్దను అనుమతిస్తారు. అది కూడా వారికి కావాల్సిన వస్తువులు, ఆహారం తీసుకోవడం కోసమే. అవి ఇచ్చిన తర్వాత మళ్లీ రూమ్ లో తలుపులు వేసుకుంటారు. ఇంట్లోకి ఎవరైనా వస్తే పచ్చి బూతులతో విరుచుకుపడతారు. దుప్పటి కప్పుకుని తల్లీకూతుళ్లు గదిలో నుంచే సమాధానం చెబుతారు. రెండేళ్లుగా తండ్రే వారిద్దరికి అప్పుడప్పుడు భోజనం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
”ఎవరైనా ఏమైనా చేస్తారనే భయం. చేతబడి, బాణామాతి చేశారని భయపడి పోయి ఇంట్లోనే ఉండిపోయారు. వాళ్లకు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు టెన్త్ వరకు చదువుకున్నావ్. చేతబడి లాంటివి లేవు. అలాంటివి చేస్తే జనాలు ఎవరూ మిగలరు. చేతబడి భయంతో రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఎవరైనా భయపెట్టారో, వాళ్లు భయపడ్డారో.. చేతబడి భయం పట్టుకుంది. మాట్లాడితే చేతబడి అంటున్నారు తల్లీకూతుళ్లు” అని ఆ ఇంటి పెద్ద సూరిబాబు చెప్పారు.
గత మూడేళ్లుగా తల్లీకూతుళ్లు ఇంట్లోని ఓ గదికే పరిమితం అయ్యారు. ఎట్టకేలకు పోలీసుల చొరవతో వారిద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడేళ్లుగా ఒకే గదిలో నాలుగు గోడల మధ్యనే ఉండిపోవడంతో ఆ ఇద్దరిపై మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంది. వారిద్దరికి వైద్యం అందించాక, కౌన్సిలింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
దాదాపు మూడేళ్లుగా కనీసం ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేదు. ఒకే గదిలో అది కూడా దుప్పటి కప్పుకుని గడుపుతున్నారు. వాళ్ల నాన్నే తల్లీకూతుళ్లకు వండి పెడుతున్నాడు. అతను కూడా ఎంత చెప్పినా.. వాళ్లు మాత్రం వామ్మో మేము బయటకు రాలేం అన్నారు. ఇదీ మణి ఆమె కూతురు దుర్గా భవానీ దయనీయ స్థితి. కాకినాడ జిల్లా కుయ్యేరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.