కృష్ణా నదికి పెరుగుతున్న వరద ఉధృతి.. భయాందోళనలో లంక గ్రామాల ప్రజలు

వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు.

Krishna River Floods (Photo Credit : Google)

Krishna River Floods : కృష్ణా నదికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు మరపడవపై తోడేళ్ల లంక దిబ్బకు వెళ్లి లంక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు రావాలని జేసీ గీతాంజలి శర్మ కోరారు. చిన్నపిల్లలు, బాలింతలు ముందుగా సురక్షిత ప్రాంతాలకు రావాలన్నారు. దారి ఉండగానే వెళదామని చెప్పారు. వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు జేసీ గీతాంజలి శర్మ. అటు వరద ప్రవాహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తోడేళ్ల లంక, దిబ్బ లంక, రావి చెట్ల లంక గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. వరద ప్రవాహం ఉధృతంగా వస్తుందని ప్రజలు అప్రమత్తతో సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని ఆయన సూచించారు. ప్రజలను తరలించడానికి బాపట్ల, మచిలీపట్నం నుంచి బోట్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం నుంచి 4, బాపట్ల నుంచి కొన్ని బోట్లు తెప్పిస్తున్నామన్నారు. బోట్లు రాగానే ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని వెల్లడించారు. వల్లూరు పాలెం, తోట్ల వల్లూరులో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, అధికారులు పరిశీలించారు.

”ఎంత విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తొలుత సురక్షిత ప్రాంతాలకు రావాలి. వరదపై ప్రజలను అప్రమత్తం చేయాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు” అని ఎమ్మెల్యే తెలిపారు.

రేపల్లె మండలం పెనుమూడి పల్లిపాలెంను వరద నీరు చుట్టుముట్టింది. బాధితులను తరలించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామాగ్రితో సహా పునరావాస కేంద్రాలకు బాధితులు తరలివస్తున్నారు. బోట్లలో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు సిబ్బంది. ప్రకాశం బ్యారేజీ నుండి 7 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో లంక గ్రామాలను వరద నీరు తాకుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది.

50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం..
కాగా.. భారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ అతలాకుతలం అయ్యింది. 30 సెంటీమీటర్ల వానకు బుడమేరు వాగు పొంగడంతో ఈ దుస్థితి నెలకొంది. చాలా కాలనీలు నీట మునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. కొందరు ఆహారం, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యేలు కాలనీల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. విజయవాడలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురిసిందని, అందువల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని స్థానికులు వాపోయారు.

Also Read : నీట మునిగిన కాలనీలు, స్తంభించిన జనజీవనం.. విజయవాడలో వరద బీభత్సం

ట్రెండింగ్ వార్తలు