ఏలూరు జిల్లాలో విషాదం.. బాణసంచా తయారీ కేంద్రం దగ్గర పిడుగు పడి ఇద్దరు మృతి..

పిడుగు పాటుకు బాణసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మందు గుండు సామాగ్రి పేలింది.

Lightning Strike In Eluru : ఏలూరు జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పడటంతో మంటలు చెలరేగి ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పిడుగు పడిన సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో సుమారు 20 మంది ఉన్నారు. కొందరు బయటకు పరుగులు తీసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

దువ్వ (పశ్చిమ గోదావరి జిల్లా) ప్రాంతానికి చెందిన శివ.. క్రాకర్స్ తయారీ వ్యాపారం చేస్తుంటాడు. దువ్వ ప్రాంతంలో శివకు తయారీ కేంద్రం ఉండేది. అయితే, అక్కడ అనుమతులు ఇవ్వకపోవడంతో దాన్ని తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో రోడ్డు పక్కన తనకున్న స్థలంలో క్రాకర్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలంగా అక్కడే బాణసంచా తయారు చేస్తున్నారు.

ఇవాళ(అక్టోబర్ 30) సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పిడుగులు కూడా పడ్డాయి. బాణసంచా తయారీ కేంద్రానికి సమీపంలోనే ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పిడుగు పాటుకు బాణసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మందు గుండు సామాగ్రి పేలింది. ఆ సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో దాదాపు 20 మంది మహిళలు పని చేస్తున్నట్లు సమాచారం. మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

ఇక, తయారీదారులు శివ, అతడి భార్య మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారందరికి తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. వారందరికి చికిత్స అందిస్తున్నారు. ఈ బాణసంచా తయారీ కేంద్రం తొలుత దువ్వ ప్రాంతంలో ఉండేది. అయితే, నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు అక్కడ అనుమతులు ఇవ్వలేదని తెలుస్తోంది. అక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడంతోనే.. శివ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే ఉండ్రాజవరంలో బాణసంచా తయారు చేస్తున్నాడు.

అయితే, బాణసంచా తయారీ కేంద్రంలో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ పాటించడం లేదని తెలుస్తోంది. దీపావళి పండుగ నేపథ్యంలో పెద్దఎత్తున మందు గుండు సామాగ్రిని తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమీపంలో పిడుగు పడటం, అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం.. అనుకోకుండా ఇవన్నీ జరిగిపోయాయి.

 

Also Read : టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..