జగనన్నకు నంద్యాల తాగుబోతుల విన్నపం.. మున్సిపల్ ఎన్నికల్లో పిచ్చ కామెడీ

Letter To Cm Jagan

liqour addicted people special request to cm jagan: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఫ్యాన్ గాలి వీచింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ విజయాన్ని వైసీపీ నమోదు చేసింది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంబరాన్ని తాకేలా సంబరాలు జరుపుకుంటున్నారు.

కాగా, కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందికి చిత్రమైన అనుభవం ఎదురైంది. ఓటుతో పాటు వారికి ఓ చీటీ కనిపించింది. ఏంటా అని దాన్ని తెరిచారు. అందులో ఏం రాసి ఉందో చూసి విస్తుపోయారు. ఆ తర్వాత మందుబాబులు చేసిన విన్నపాన్ని చదవి నవ్వు ఆపుకోలేకపోయారు.

 

నంద్యాల 29వ వార్డులో ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్‌ బాక్సులో ఓట్లతో పాటు తెల్ల కాగితం మీద ముద్రించిన చీటీలు స్లిప్పులు వచ్చాయి. ‘నంద్యాల తాగుబోతుల విన్నపం’ పేరుతో ఆ చీటీలు ఉన్నాయి. అందులో ఏం రాసుందంటే.. మద్యం అమ్మకాల్లో కొత్త బ్రాండ్లు అయిన సుప్రీం, దారు, హైదరాబాద్‌, జంబో వంటి వాటిని తొలగించి పాత బ్రాండ్లు రాయల్‌ స్టాగ్‌, ఇంపీరియల్‌ బ్లూ, బ్లాక్‌ డాగ్‌ రకాల అమ్మకాలు జరపాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. పాత బ్రాండ్లు అమ్మకపోతే.. ఇదే తమ చివరి ఓటు అవుతుందని హెచ్చరించారు కూడా. ఇట్లు నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ లేఖను ముగించారు.

ఇప్పుడీ చీటీ వైరల్ గా మారింది. నవ్వులు పూయిస్తోంది. ప్రపంచంలో మరే సమస్య లేనంటూ.. సీఎం జగనన్నకు మందుబాబులు చేసిన ప్రత్యేక విన్నపం కడుపుబ్బా నవ్విస్తోంది.