durga temple పాలకమండలి సభ్యురాలి కారులో అక్రమ మద్యం

  • Publish Date - October 1, 2020 / 08:09 AM IST

durga temple : ఏపీ ఎక్సైజ్ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… రాష్ట్రంలో తెలంగాణ మద్యం ఏరులై పారుతోంది. తాజాగా దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలి కారులో అక్రమ మద్యం దొరకడం కలకలం రేపింది. నాగవరలక్ష్మి భర్తతో పాటు కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో తమను అక్రమంగా ఇరికించారంటూ నాగవరలక్ష్మి ఆరోపిస్తున్నారు.



విజయవాడ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చక్కా వెంకట నాగ వరలక్ష్మి కారులో అక్రమ మద్యం దొరకడం సంచలనంగా మారింది. తెలంగాణలోని మద్యం షాపుల్లో విక్రయించే మద్యం బ్రాండ్లు అందులో ఉన్నాయి. వాటి విలువ సుమారు 40 వేలు ఉంటుందని పోలీసులు లెక్కించారు. ఈ ఘటనకు సంబంధించి నాగ వరలక్ష్మి భర్త వరప్రసాద్, కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వెంకట నాగ వరలక్ష్మి నివాసంలో కారు నుంచి పోలీసులు ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ 16 బీవీ 5577 నెంబరు కారులో భారీ ఎత్తున మద్యం ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడ రైడ్ చేశారు. అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌లో ఉన్న కారులో చెక్ చేయగా 283 మద్యం బాటిళ్లు దొరికాయి.



మూడ్రోజుల క్రితం తెలంగాణ నుంచి ఇంత భారీఎత్తున మద్యాన్ని తీసుకొచ్చినట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని మద్యం దుకాణాల్లో లిక్కర్‌ కొన్న తర్వాత జాతీయ రహదారి మీద నుంచి కాకుండా ఇతర పల్లెటూర్లలో నుంచి ఏపీలోకి మద్యాన్ని తరలించినట్టు పోలీసులు గుర్తించారు. కారులో దొరికిన మద్యానికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు వెంకట నాగవరలక్ష్మి. ఈ కేసులో తన భర్తను కావాలనే ఇరికిస్తున్నారని ఆరోపించారు. డ్రైవర్‌ తప్పిదంతోనే ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు.



పవిత్రమైన ఆలయానికి ట్రస్టు బోర్డు సభ్యురాలి కారులో మద్యం పట్టుబడడం… అది కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం అక్రమంగా తరలించినట్టు గుర్తించడం సంచలనంగా మారింది. అయితే, మద్యం తరలింపు విషయం ఆమెకు తెలిసే జరిగిందా? లేకపోతే నాగవరలక్ష్మి నేమ్ బోర్డు ఉన్న కారును వినియోగించి… ఆమెకు తెలియకుండా అక్రమంగా మద్యం తరలించారా అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు