Kidnap Incident In Satyasai District
Kidnap Incident In Satyasai District : శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కిడ్నాప్ కలకలం రేపింది. మద్యం టెండర్ దక్కించుకున్న రంగనాథ్ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. రంగనాథ్ భార్యకు దుండగులు కిడ్నాప్ చేశారు. నీ భర్తను వదిలేయాలంటే మద్యం టెండర్ షాప్ ను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు రూ.10లక్షలతో పాటు నెల నెల రూ.10వేలు ఇస్తామని వారు తనతో చెప్పారని రంగనాథ్ భార్య వెల్లడించారు. కాగా, రంగనాథ్ భార్య, అతడి బంధువులు పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో రంగనాథ్ అనే వ్యక్తి కిడ్నాప్ తీవ్ర దుమారం రేపింది. ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా మద్యం షాపులకు టెండర్ వేశారంటూ రంగనాథ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం. రంగనాథ్ ఈరోజు మధ్యాహ్నం పుట్టపర్తిలోని లేపాక్షి మండలానికి సంబంధించి 51వ షాపు లాటరీ ద్వారా దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు లేపాక్షికి వెళ్తుండగా.. దారిలో అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని సమాచారం. రంగనాథ్ భార్య, అతడి బంధువులు పుట్టపర్తిలో ఆందోళనకు దిగారు.
మద్యం షాపు దక్కించుకున్నందుకే తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. తన భర్త తిరిగి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. అలాగే దీనిపై పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. సాయంత్రం ఆరున్నర, ఏడు గంటల ప్రాంతంలో కిడ్నాపర్ల నుంచి తనకు ఫోన్ వచ్చినట్లు రంగనాథ్ భార్య తెలిపారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా టెండర్ వేశారని, అందుకే మీ భర్తను తీసుకెళ్లారని, మీ భర్త ఎక్కడికీ వెళ్లడని, రేపు సాయంత్రానికి రంగనాథ్ తిరిగి వస్తాడని, అతడితో పాటు రూ.10లక్షలు ఇస్తామని, పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని.. కిడ్నాపర్లు తనతో చెప్పినట్లు రంగనాథ్ భార్య వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. లాటరీలో లిక్కర్ షాపు వచ్చిన వెంటనే.. కిడ్నాప్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.
Also Read : వాళ్లు గుడిని మింగేస్తే మీరు లింగాన్ని మింగేస్తున్నారు- మద్యం టెండర్ల అంశంలో సీఎం చంద్రబాబుపై షర్మిల ఫైర్