మీ త్యాగం మరువం.. వీరజవాన్లకు అశ్రునివాళి, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

martyred jawans funeral: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రమూకల కాల్పుల్లో అమరులైన వీర జవాన్లు మహేశ్(నిజామాబాద్), ప్రవీణ్ కుమార్‌రెడ్డి(చిత్తూరు) అంత్యక్రియలు కాసేపట్లో సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమటిపల్లిలో మహేశ్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన ప్రవీణ్ అంత్యక్రియలు కూడా సైనిక లాంఛనాలతో జరగనున్నాయి.
18ఏళ్ల క్రితం ఆర్మీలో చేరిన ప్రవీణ్.. మాతృభూమి రక్షణకు జీవితం అంకితం:
18ఏళ్ల క్రితం ఆర్మీలో చేరి.. హవల్దార్‌గా సేవలందించిన ప్రవీణ్.. ప్రత్యేక కమాండో ట్రైనింగ్ తీసుకొని మిలటరీ ఆపరేషన్స్‌లో అనుభవం గడించారు.. గత ఆదివారం(నవంబర్ 8,2020) పాక్ ముష్కరుల చొరబాట్లను అడ్డుకునే క్రమంలో వీర మరణం పొందారు.. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. సాధారణంగా ఆర్మీలో పదేళ్లు పని చేసి తిరిగి.. సొంతూరికి వచ్చి ఇతర ఉపాధి వెతుక్కోవడం జరుగుతుంటుంది.. కానీ మాతృభూమి రక్షణే తనకి అసలైన పనిగా భావించిన ప్రవీణ్.. చివరికి డ్యూటీలోనే ప్రాణాలు కోల్పోవడం పుట్టిన గడ్డకి గర్వకారణమైతే.. కుటుంబానికి మాత్రం తీరని లోటుగా మిగిలింది. ప్రవీణ్ మరణవార్తతో స్వగ్రామమైన చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రవీణ్‌కు భార్య రజిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది:
వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భౌతిక కాయానికి ఎమ్మెల్యే MS బాబు నివాళులు అర్పించారు. రెడ్డివారిపల్లికి వెళ్లిన ఎమ్మెల్యే .. వారి కుటుంబాన్ని పరామర్శించారు.. ప్రవీణ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విషయం తెలుసుకోగానే సీఎం వైఎస్ జగన్ ప్రవీణ్ కుటుంబానికి 50 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారన్నారు ఎమ్మెల్యే బాబు.
https://10tv.in/jawan-from-nizamabad-dist-among-4-killed-near-loc/
చిన్నప్పటి నుంచి మహేశ్ లో దేశభక్తి భావాలు:
ఉగ్రమూకల కాల్పుల్లో అమరుడైన మరో వీర జవాన్ ర్యాడా మహేష్ నిజామాబాద్ జిల్లా వాసి. వేల్పూర్ మండలం కోమటిపల్లి ఆయన స్వగ్రామం. గంగమల్లు, రాజు ఆయన తల్లిదండ్రులు. వీరిది వ్యవసాయ కుటుంబం. మహేష్ అన్న ఉపాధి కోసం గల్ప్‌కు వెళ్లాడు. మహేశ్ 2014లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరారు. చిన్నప్పటి నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్ ఆ ఆసక్తితో ఆర్మీలో చేరారు. ఆరేళ్ల నుంచి దేశసేవలో నిమగ్నమై ఉన్నారు మహేష్. జవాన్ మరణ వార్త తెలియడంతో గ్రామంలో విషాదం నెలకొంది… తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల అంత్యక్రియలు పూర్తి సైనిక లాంఛనాలతో మధ్యాహ్నం జరగనున్నాయి. కాగా, సుహాసినిని రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మహేష్. నవంబర్ 21న మహేష్ పుట్టిన రోజు. ఇంటికి వస్తానని మహేష్ భార్యతో చెప్పాడు. కానీ ఇంతలోనే ఊహించని ఘటన జరిగింది. మహేష్ మరణాన్ని కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.