మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(MCA) కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకుని రానున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం.
ఎంసీఏ కోర్సు వ్యవధి ఇప్పటివరకు మూడేళ్లు ఉండగా.. దానిని రెండేళ్లకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో 2020-21నుంచి MCA రెండేళ్ల కోర్సుగా మారనుంది. దీనిపై ఇప్పటికే ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకుంది.
దేశంలో 1990 ప్రాంతంలో ఈ కోర్సును ప్రవేశపెట్టగా దశాబ్దకాలం నుంచి ఈ కోర్సుకు ఆదరణ కరువైంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయంలో భాగంగా.. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి తీసుకుని వచ్చి ఏడాది తగ్గిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఎంసీఏ మూడేళ్లు (6 సెమిస్టర్లు) బదులుగా రెండేళ్లు (4 సెమిస్టర్లు)లో పూర్తి చేస్తే పట్టా పొందవచ్చు.
రెండేళ్ల పాఠ్యాంశాలు ఎలా ఉండాలో సిద్ధం చేయాలంటూ యూనివర్శిటీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2020-21 విద్యాసంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు.