AP Rains : ఏపీకి రెయిన్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. భీకర గాలులు
AP Rains : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- Harish Thanniru
- Updated on- September 9, 2026 / 07:18 AM IST
AP Rains
AP Rains : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలతో పాటు ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, పిడుగులు పడే చాన్స్ ఉందని హచ్చరికలు జారీ చేసింది.
Also Read : Majji Srinivasa Rao YSRCP : ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్.. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా..!
తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అదేవిధంగా.. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అకస్మాత్తుగా కురిసే వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలతోపాటు ఈదురుగాలుల తీవ్రత ఉండే అవకాశం ఉందని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.
ఏపీలో కొద్దిరోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు సాగు చేయగా.. పలు ప్రాంతాల్లో వర్షాలు లేక మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకోసం ఎదురు చూస్తున్నారు.
ఇదిలాఉంటే.. మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదయ్యాయి. తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 52.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా పెరికగూడెంలో 31.3 మి.మీ., పెంటపాడులో 27.6 మి.మీ. వర్షం కురిసింది. చందర్లపాడు, పండ్రపాడులో 24 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
