Majji Srinivasa Rao YSRCP : ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్.. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా..!
Majji Srinivasa Rao YSRCP : బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. విజయనగరం జిల్లా అధ్యక్ష, భీమిలి సమన్వయకర్త పదవుల నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. సీఎం చంద్రబాబును కూడా కలవనున్నట్టు సమాచారం..
Majji Srinivasa Rao YSRCP
- ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. వైసీపీకి మజ్జి శ్రీను రాజీనామా
- వైసీపీని వీడిన చిన్న శ్రీను.. పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ
- పార్టీ పదవులకు గుడ్‌బై.. జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా
Majji Srinivasa Rao YSRCP : ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందే విజయనగరం వైసీపీలో కీలక మార్పు చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను రాజీనామా చేశారు.
జగన్ కు రాజీనామా లేఖ :
మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు మేనల్లుడైన మజ్జి శ్రీనివాసరావు.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన పార్టీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని తెలియజేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా రాజీనామా లేఖ పంపినట్లు సమాచారం.
విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను సైతం ఆయన వదులుకున్నారు. గతంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా మజ్జి శ్రీనివాసరావు పనిచేశారు. తాను వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Read Also : Telangana Assembly : తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డికి షాక్.. మండలి నుంచి సస్పెన్షన్.. ఎప్పటివరకంటే?
భవిష్యత్తు కార్యచరణపై సస్పెన్స్ :
అయితే, ఆయన తర్వాతి రాజకీయ అడుగుపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయాన్ని కూడా ఆయన అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా, మజ్జి శ్రీనివాసరావు త్వరలో సీఎం చంద్రబాబును కలవనున్నారనే ప్రచారం ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ భేటీ అనంతరం ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని చర్చ జోరుగా నడుస్తోంది.
మరోవైపు, మజ్జి శ్రీను రాజీనామా నేపథ్యంలో ఆయన కుటుంబ రాజకీయ భవిష్యత్‌పై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అంశంపై కుటుంబంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మజ్జి శ్రీనివాసరావు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆయన తన రాజీనామాను మాత్రమే అధికారికంగా ప్రకటించారు.
