AP Weather Update: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతోపాటు దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది శుక్రవారం నాటికి మరింత బలపడుతుందని, క్రమంగా పశ్చిమ – వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలింది. మరోవైపు అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణాలతో ఏపీలోని శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఇవాళ (శుక్రవారం) రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా.. విశాఖపట్టణం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే అవకాశం కూడా ఉండటంతో వర్షం పడుతున్న సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
శనివారం, ఆదివారం కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. శని, ఆదివారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పల్నాడు, కాకినాడ, కృష్ణా తదితర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.