Botsa Three Capitals
Minister Botsa Satyanarayana: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ విధానం మారదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని శక్తులు రాజధానులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పకుండా మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడమే తమ విధానమని.. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరతామని బొత్స మరోసారి తేల్చి చెప్పారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్నీ నెరవేర్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని మంత్రి అన్నారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు 94 శాతం నెరవేర్చారని.. చెప్పనివీ మరో 40 హామీలు అదనంగా అమలు చేశారన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేసినట్లు మంత్రి చెప్పారు. రెండేళ్ల పాలనపై సీఎం జగన్ విడుదల చేసిన పుస్తకాన్ని ప్రతి లబ్ధిదారుడికీ చేరవేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.