Minister Jogiramesh
Minister Jogiramesh: వంగవీటి రంగా (Vangaveeti Ranga) పేరును వాడుకొనే అర్హత వైఎస్ఆర్ (YSR) అభిమానులమైన మాకే ఉందని మంత్రి జోగి రమేష్ (Minister Jogiramesh) అన్నారు. విజయవాడ (Vijayawada) లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి జోగిరమేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు తదితరులు హాజరయ్యారు. రంగా జయంతి వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో రంగా అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జోగిరమేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా పేరుఎత్తే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు.
నేను రంగా శిష్యుడిని. రంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. కోస్తా జిల్లాల టైగర్ వంగవీటి రంగా. పేద, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి రంగా అని మంత్రి జోగి రమేష్ కొనియాడారు. రంగాను పొట్టన పెట్టుకుంది ఎవరో అందరికీ తెలియాలి. రంగా వెన్నులో దిగిన కత్తి.. ఆయనపై విసిరిన బాంబు టీడీపీది కాదా..? చంద్రబాబుది కాదా? అని జోగి రమేష్ ప్రశ్నించారు. రంగాను చంపింది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పార్టీ కాదా? రంగా బొమ్మ పెట్టుకుని సైకిల్ గుర్తుకు ఓటేస్తే రంగా ఆత్మ శాంతిస్తుందా అంటూ జోగిరమేష్ ప్రశ్నించారు. రంగా అంటే ఎవరో తెలియని వ్యక్తి ఆయనకు టీ ఇచ్చానంటాడు.. అసలు వంగవీటి మోహనరంగా పేరు పలికే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని జోగి రమేష్ అన్నారు. నువ్వు చంద్రబాబు పల్లకీ మోస్తే.. రంగా అభిమానులు కూడా మోయాలా? రంగా మాకు దైవం.. గురువు.. ఆయనే మాకు ఆదర్శం. టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ దయచేసి రంగా పేరును వాడొద్దు.. పలకొద్దు. రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్ అభిమానులమైన మాకే ఉంది. రంగా పేరును కలకాలం నిలిచేలా చేస్తాం అని మంత్రి జోగి రమేష్ అన్నారు.
రంగా హత్యకు చంద్రబాబే కారణం ..
వంగవీటి మోహనరంగా అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిని నేను. అందరిలోనూ ధైర్యం నింపగల శక్తిమంతుడు, పోరాట యోధుడు రంగాకు ముందు.. రంగాకు తర్వాత మరొకరు లేరని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి రంగా. ఎన్టీఆర్ టీడీపీ పార్టీలో జరుగుతున్న తప్పులను ఎదిరించి ప్రశ్నించిన మొనగాడు రంగా అని మల్లాది విష్ణు అన్నారు. పోలీస్ బిల్లును వ్యతిరేకించి ఉద్యమం చేసిన వ్యక్తి రంగా అని, రంగా హత్యకు టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబే కారణమని మల్లాది విష్ణు ఆరోపించారు. రంగా పేరును చిరకాలం ప్రజలు స్మరించుకునేలా మావంతు ప్రయత్నం చేస్తాం. సీఎంతో మాట్లాడతాం. నేను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే వైఎస్సార్, రంగాలే కారణం అని మల్లాది విష్ణు అన్నారు.